ఉద్యోగులు కొంత ఓపికతో ఉండాలి
అనవసర రాద్దాంతంతో ఆందోళన తగదుఘాటుగా స్పందించిన మంత్రి బొత్స
అమరావతి,నవంబర్29 ( జనంసాక్షి) ): ఉద్యోగుల సమస్యలను ఏపీ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగులు కొంత ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్‌సీ, ఇతర సమస్యలపై ఏపీ ఐక్యకార్యచరణ, ఏపీ ఐక్యకార్యచరణ అమరావతి ఉద్యోగ సంఘాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి దశలవారీగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సోమవారం స్పందించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అనవసర రాద్దాంతం చేసేందుకే కొందరు ఆందోళన చేస్తున్నారని వెల్లడిరచారు. గ్రామ పంచాయతీ నిర్వహణ ఖర్చుల చెల్లింపునకే 15వ ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నామని, పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులను కోరారు. ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నాయని, ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఉద్యోగులతో చర్చలు జరిపామని, ఐఆర్ ప్రకటించామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. పురపాలక సంఘాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు ఆగలేదని, ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపదికన ఇస్తామన్నారు. అనవసర రాద్దాంతం చేసేందుకే కొందరు ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. పంచాయతీ నిర్వహణ ఖర్చుల చెల్లింపునకే 15వ ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నామని, ఆ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదని బొత్స సత్యనారాయణ తెలిపారు.