ఉద్రిక్తంగా మున్సిపల్‌ కార్మికుల ఆందోళన

జిఓ 279 రద్దు కోరుతూ నినాదాలు..పోలీసులు మొహరింపు

అనంతపురం,నవంబర్‌21(జ‌నంసాక్షి): హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటిని మున్సిపల్‌ కార్మికులు ముట్టడించడంతో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్‌ కార్మికులకు శాపంగా ఉన్న 279 జిఒ ను అమలు చేయకూడదు అంటూ హిందూపురంలోని సినీనటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ఆవరణలో మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికులు చెత్తను వేసి ఆందోళన నిర్వహించారు. అందోళన నిర్వహిస్తున్న కార్మికులను పోలీసులు అడ్డగించి, వారిని అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించారు. దీంతో అందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనియన్‌ నాయకులను అరెస్టు చేయడంతో, అందోళనకారులు పోలీసు జీపులను అడ్డుకున్నారు. నాయకులను అరెస్టు చేసి పోలీస్టేషన్‌లకు తరలించారు. ఈ తోపులాటలో 4 వ డివిజన్లో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికురాలు స్పృహ కోల్పోయింది. పోలీసులు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు దక్షిణ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌ మాట్లాడుతూ.. గత అక్టోబర్‌ నెలలో 13 రోజుల పాటు మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేశారన్నారు. ఆ సమయంలో మున్సిపల్‌ ఉన్నతాధికారులు జిఒ ను మూడు నెలల వరకూ అమలు చేయం అని, మున్సిపల్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారని తెలిపారు. కాని జిల్లాలో ఏ పురపాలక సంఘంలోను జిఒ ను అమలు చేయకుండా హావిూని తుంగలో తొక్కారన్నారు. హిందూపురం పురపాలక సంఘంలో మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున జిఒ ను అమలు చేసి హీరో కావాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. వెంటనే కార్మికులకు శాపంగా ఉన్న 279 జిఒ ను రద్దు చేసి కార్మికులకు ఉపయోగ కరంగా ఉన్న 151 జిఒ ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో స్థానిక కార్మికులతో బాలకఅష్ణ ఇంటిని ముట్టడి చేస్తామన్నారు. త్వరలో చలో హిందూపూర్‌ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులందరితో పట్టణంలో భారీ ర్యాలీ

నిర్వహించి మరోసారి బాలకృష్ణ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాము, రాజప్ప, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ముత్యాల మల్లికార్జున, పరుశురాం, రంగనాథ్‌, ఈరప్ప, పెద్ద ఎత్తున మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.