ఉనికికోసమే రాజకీయ యాత్రలు: కెఇ

అమరావతి,నవంబర్‌22(జ‌నంసాక్షి): రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి యాత్రల పేరిట ప్రజలను వైకాపా నేతలు మభ్యపెడుతున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసి దేశ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం లిఖించారన్నారు. పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా నది నీరు కర్నూలు జిల్లాలోని హాంద్రీకాల్వకు పారించాన్నారు. పట్టిసీమను రాజకీయం చేసిన వైకాపా, కాంగ్రెస్‌ పార్టీలు అభాసుపాలు కాక తప్పలేదన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణానీటిని వాడుకునే వెలసుబాటు ఉందని సిఎం చంద్రబాబు నిరూపించారని అన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌కు కాల్వకు ప్రభుత్సవం రూ.1300 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో మూడో స్థానంలో ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏడు మిషన్లు, అయిదు గ్రిడ్లతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తొందని అన్నారు. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్‌దే అన్నారు. కాంగ్రెస్‌ హాయంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. రాష్ట్రంలో గూడు లేని పేదలు ఉండకూడదనే లక్ష్యంతో మొత్తం 50 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.