ఉపాధికూలీలకు బకాయిలు చెల్లించాలి
అనంతపురం,సెప్టెంబర్26(జనంసాక్షి):జిల్లాలోని ఉపాధి హావిూ కూలీలకు బకాయి పడ్డ ఉపాధి బిల్లులు చెల్లించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.క్రిష్ణమూర్తి డిమాండ్ చేశారు. జిల్లాలో వేలాదిమంది కూలీలకు నాలుగు నెలల నుంచి ఉపాధి హామి పనులు చేస్తే బకాయి పెట్టారన్నారు. రెక్కల కష్టం విూద ఆధారపడి పని చేసిన కూలీలకు ఉపాధి బిల్లులు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన స్పందన లేదన్నారు. ఉపాధి హావిూ పథకాన్ని నీరుగార్చేందుకు నీరు-ప్రగతి పేరుతో తెలుగు తమ్ముళ్లు తమ జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. అధికార పార్టీ కారణంగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. వృథా ఖర్చులతో రెండు ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయంటూ దుయ్యబట్టారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెదేపా రెండూ.. ఇప్పటి వరకు ఎంత మంది పేదలకు భూములిచ్చారు.. ఎంతమందికి ఇళ్లు నిర్మించారన్న విషయమై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన మూడేళ్లల్లో చేపట్టిన ప్రగతి శూన్యమని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని బయటకు తీసుకువచ్చి నల్లకుబేరుల భరతం పడుతామంటూ వాగ్దానాలు చేసిన ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటి తీసుకున్న చర్యలేంటో చెప్పాలన్నారు. భాజపా అధికారంలోనికి వచ్చాక దళితులు, గిరిజనులు, మైనార్టీలు, అభ్యుదయవాదులపై దాడులు నానాటికి పెరుగుతున్నా వాటిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.