ఉపాధి హామీ నగదు బదిలీకి వారధి : ప్రధాని
ఇది మరో ఆర్థిక విప్లవం : సోనియా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) :
ఉపాధి హామీ పథకం కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నగదు బదిలీకి వారధిలాంటిదని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఆవిర్భావ దినోత్సవ సభను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం ఆర్థిక చైతన్యం తీసుకువచ్చిందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలి డబ్బులను గ్రామీణులకు ‘నగదు బదిలీ’ ద్వారా చెల్లిస్తామని ప్రకటించారు. ఇందుకోసం కూలీలు బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల జాబితాకు కొత్తగా మరో 30 పనులు జత చేసినట్లు ప్రధాని వెల్లడించారు. నిరుపయోగంగా ఉన్న భూములను ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు, సాగులోకి తీసుకురావడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. తద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా లబ్ధి చేకూరుతుందని అభిప్రా యపడ్డారు. ఉపాధి హామీ పథకం
గ్రామీణ పేదలకు మంచి ఆర్థిక చేయూత కల్పించిందన్నారు. ఉపాధి హామీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుని పటిష్టవంతంగా పథకం అమలు జరిగేలా చూస్తామన్నారు. పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొంచేందుకు చర్యలు చేపట్టామని, అక్రమాలకు తావు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. గతేడాది కాలంగా ఉపాధి పథకంలో అనేక మార్పులు చేసినట్లు గుర్తు చేసిన ప్రధాని, మానవ వనరులు ఎక్కువైతే ఇంటిగ్రేటేడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీంలో ఉపయోగించుకుంటామన్నారు. ఉపాధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్టాల్రతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని, పంచాయతీలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని గ్రావిూణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సూచించారు. నగదు బదిలీతో ఆర్థిక విప్లవం రానుందని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అన్నారు. ఉపాధి హామీని వ్యవసాయ రంగానికి అనుసంధానించాలని గట్టిగా నొక్కిచెప్పారు. తద్వారా రెండో హరిత విప్లవం రావడంలో ఉపాధి హామీ పథకం క్రియాశీలక పాత్ర పోషించనుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తి పెరగడంలో ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నానని, దీని వల్ల చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. చిన్న, సన్నకారు రైతులకు సాగునీటి సౌకర్యాలు కల్పించడం, నిరుపయోగ భూములను చదును చేసి సాగులోకి తీసుకురావడం తదితర చర్యల ద్వారా వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని గణనీయంగా పెంచవచ్చని పేర్కాన్నారు. ‘ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానించడం ద్వారా రైతులకు అధునాతన పద్ధతలు అందుబాటులోకి వచ్చి వ్యయసాయోత్పత్తి ద్విగుణీకృతం అవుతుంది. తద్వారా మన కల రెండో హరిత విప్లవం సాధ్యం కావడంలో ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తుంది’ అని చెప్పారు. అయితే, ఉపాధి పథకంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని సోనియా తెలిపారు. జాతీయ గ్రావిూణ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. మహిళా కూలీలకు ఆటంకాలు లేకుండా పని కల్పిస్తామని సోనియా హామీ ఇచ్చారు.