ఉపాధి హావిూని పక్కాగా అమలు చేయాలి
అనంతపురం,జూలై19(జనం సాక్షి): ఉపాధిహావిూ పథకాన్ని నిర్వీర్యం చేయకుండా, కూలీలకు విరివిగా పనులు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్వర్ తెలిపారు. ప్రజలు, కార్మికులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందున్నాయని అన్నారు. గ్రామాల్లో కూలీలకు భరోసాను ఇస్తున్న ఉపాధి హావిూ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. జిల్లాలో వేలాది మంది కూలీలకు కోట్లాదిరూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెరిగిన ఖర్చుల దృష్ట్యా కూలి రూ.300కు పెంచాలని డిమాండ్ చేశారు. 200 రోజుల పనులను కల్పించాలన్నారు. ఉపాధిహావిూ ఫీల్డ్ అసిస్టెంట్లను రెగ్యులర్ చేసినెలకు రూ.23వేల కనీస వేతనం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్న ఇన్‌పుట్ సబ్సిడీతో రైతులకు ఒనగూరింది ఏవిూ లేదన్నారు. చాలా మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందక వ్యవసాయ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అనేక హావిూలు గుప్పించారన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. అంగన్ వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మికులు, పారిశుధ్య కార్మికులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే మంజూరు చేయాలని కోరారు. కార్మికులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి సిద్ధం అవుతున్నామన్నారు.