ఉపాధ్యాయులకు జైలు శిక్ష విధించే ఉత్తర్వులు రద్దు చేయాలి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 24 : విద్యార్థులను దండిస్తే ఉపాధ్యాయులకు జైలు శిక్ష విధించే చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పిఆర్‌టియు డిమాండ్‌ చేసింది. ఉపాధ్యాయుల ఉనికి ప్రశ్నార్థకంగా మార్చే ఉత్తర్వులను చట్టంగా రూపొందించేందుకు పార్లమెంటులో ఆమోదానికి తీసుకువెళ్లడాన్ని సంఘం ఖండించింది. విద్యార్థులను ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు మందలించడం సహజమని విద్యార్థులను మంచిగా తీర్చిదిద్దే సందర్భాల్లో శిక్షించడం మామూలేనని సంఘం పేర్కొంది. ఇలాంటి విషయాల్లో ఉపాధ్యాయులకు జైలు శిక్షలు విధించే ఉత్తర్వులు వారి విధులకు ప్రమాదకరంగా మారుతాయని అన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ ఉత్తర్వులను ఉపసంహరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అదే విధంగా తెలంగాణపై ఈ పార్లమెంటు సమావేశాల్లోని సానుకూల ప్రకటన చేయాలని సంఘం డిమాండ్‌ చేసింది.