ఉమెన్ చాందీ రాకతో ఊపందుకున్న కాంగ్రెస్
జిల్లాలో మళ్లీ పూర్వ వైభవం కోసం ఆరాటం
కాకినాడ,ఆగస్ట్29(జనం సాక్షి): ఉమెన్ చాందీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వచ్చాక కాంగ్రెస్‌లో కాక పుట్టింది. కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ జిల్లా సారథి కోసం అన్వేషణ మొదలైంది. ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పంతం నానాజీ ఇటీవల రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.జూలై నెలలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ కాకినాడలో నిర్వహించిన సమావేశానికి చెప్పుకోదగ్గ స్పందనే వచ్చింది. 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ సమావేశంలోనే నిర్ణయించుకున్నారు. కనీసం ఏడెనిమిది చోట్ల ప్రధాన పార్టీల గెలుపు-ఓటమిలలో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు వ్యూహాలు కూడా రూపొందించుకున్నారు. సెప్టెంబరు 15 నాటికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని భర్తీ చేయడానికి ఆ పార్టీ నేతలు అన్వేషణ మొదలుపెట్టారు. ఎన్నికల ముందు కొందరు, ఎన్నికల తర్వాత మిగిలిన కీలక నాయకులు కాంగ్రెస్‌ని వీడి టీడీపీ, వైసీపీలలో చేరిపోయారు. 2014 ఎన్నికల తర్వాత రాజమహేంద్రవరానికి చెందిన కందుల దుర్గేష్‌కి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆయన వైసీపీలోకి జంప్ అవ్వడంతో డీసీసీ అధ్యక్ష పదవిని పంతం నానాజీకి అప్పగించారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరిపోయారు. దీంతో ఆ స్థానం మళ్లీ ఖాళీ అయింది. ఇపుడు ఈ పదవిని ఎవరికి కట్టబెట్టాలా? అని కాంగ్రెస్ పెద్దలు తలలుపట్టుకుంటున్నారు. ఆ పార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నురుకుర్తి వెంకటేశ్వరరావు, మహిళా నాయకురాలు పంతం ఇందిర, సీనియర్ దళిత నాయకుడు విలియం హ్యారీ తదితర పేర్లు తెరపైకి వస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీలో ఉన్న వారిలో సమర్ధుడైన వారిని ఎంపిక చేయాలని కేంద్రమాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజుకి అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. 2019 ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలతో పోటీపడే సత్తాలేకపోయినా.. కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు-ఓటములపై ఎంతోకొంత ప్రభావం చూపేందుకు కాంగ్రెస్ నాయకులు ఇప్పట్నుంచీ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా సంప్రదాయంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయతగా ఉండే సామాజికవర్గాలలో ఓట్లు చీల్చాలని వ్యూహం అమలు చేసే సమర్ధుడి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందిరమ్మ మనవడిని ప్రధాని చేయాలంటే కాంగ్రెస్‌కి ఓటు వేయాలంటూ ఆ పార్టీ చేస్తున్న ప్రచారానికి 60, 70 ఏళ్లు పైబడిన సంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లు కాస్తో, కూస్తో మొగ్గుచూపుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
——————