ఉల్లంఘనలపై చర్యలేవీ?: భూమన 

తిరుపతి,జనవరి5(జ‌నంసాక్షి): ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం నైతికమో లేక అనైతికమో స్పష్టం చేయాలని వైకాపా నేత భూమన కరుణాకర్‌ రెడ్డి  డిమాండ్‌ చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణ చేయాలని తమ పార్టీ ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతోందని చెప్పారు. రాజ్యసభలో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తీసుకున్న నిర్ణయాలు ప్రమాణం కావాలన్నారు.  ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదానికి ఒక గడువు నిర్దేశించాలని కోరినట్లు వివరించారు. వైకాపా గుర్తుపై గెలిచి, టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయకుండా కాలయాపన చేయడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో బాహాటంగానే కొనసాగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలు, అప్రజాస్వామిక పోకడలను జాతీయ స్థాయికి తీసుకెళతామని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని భావించే అన్ని పార్టీల నేతలనూ కలిసి, వారి మద్దతును కూడగడతామన్నారు. తమ పార్టీ టికెట్‌పై ఎన్నికల్లో గెలిచి, టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించడం అప్రజాస్వామికం, అనైతికం అని ఆరోపించారు. రాజ్యాంగంపై గౌరవమున్న అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు, ప్రజా సంఘాలు కలిసి రావాలని కోరారు. అధికార పార్టీ అనైతిక చర్యలను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. జన్మభూమి కేవలం చంద్రబాబు ప్రచార కార్యక్రమంగా సాగుతోందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా అని ప్రశ్నించారు.