ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో  హిందువులే అతిథులు


` పనేదైనా ఫటాఫట్‌
` పది నిమిషాల్లో పరిష్కారం
` నిత్యం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యేలు
` ఇదే వారి విజయ రహస్యం
` దారుస్సలాంలో కానరాని వివక్ష
` గల్లీ లీడర్‌ నుంచి ఢల్లీి బాసు దాకా ప్రతిరోజూ హాజరు
` ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు దర్వాజా ఖుల్లా
` ప్రజల సమస్యలకు అక్షరరూపం ఇచ్చి అధికారులకు సిఫార్సు చేసే అరుదైన వేదిక
్ష` హైదరాబాద్‌ సుదూర పరిసరాల నుంచి సైతం తండోపతండాలుగా జనం
` పార్టీ పాలసీనే ప్రజలకు చేరువ చేస్తుందంటున్న నేతాగణం

గల్లీ స్థాయి నుంచి ఢల్లీిలో జాతీయ స్థాయి పార్టీగా ఎదిగేందుకు అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకుంటున్న ఎంఐఎం గురించి సామాన్య జనం ఏమనుకుంటున్నారనేది ఓ ఆసక్తికరమైన అంశం. ముఖ్యంగా ఎంఐఎం విూద హిందూ వ్యతిరేక ముద్ర ఎప్పట్నుంచో ఉంది. కేవలం మైనారిటీల కొమ్ముకాసే పార్టీగా ఉన్న మజ్లిస్‌.. మెజారిటీ ప్రజలను విస్మరించినట్టయితే ప్రజాదరణ ఈ స్థాయిలో ఉండడం సాధ్యమవుతుందా? ఈ విషయాన్ని లోతుగా పరిశీలించేందుకే జనంసాక్షి విూడియా బృందం ఇటీవల ఆపరేషన్‌ దారుస్సలాం పేరుతో గ్రౌండ్‌ సర్వే నిర్వహించింది. అయితే జనంసాక్షి అధ్యయనంలో చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఆ ముఖ్యాంశాలేంటో జనంసాక్షి పత్రికా పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.

హైదరాబాద్‌,జూన్‌ 24(జనంసాక్షి):ఒకప్పుడు కేవలం ఓల్డ్‌ సిటీ పార్టీగా పేరున్న ఎంఐఎం.. ఇవాళ జాతీయ స్థాయి పార్టీగా ఎదుగుతోంది. కొన్ని పెద్ద పార్టీలు వివిధ చట్టసభల్లో శాసనసభా పక్ష హోదాను సైతం కోల్పోతుండగా మజ్లిస్‌ మాత్రం స్థానికంగా ఉండే హోదాను కాపాడుకుంటూ జాతీయ స్థాయికి ఎదుగుతోంది. ఈ క్రమంలో అసలు జనాభిప్రాయం ఎలా ఉందనేది ఆసక్తికరంగా మారుతోంది. ప్రతిరోజూ ఎంఐఎం ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు క్రమం తప్పకుండా 4 గంటల పాటు ప్రజలకోసమే వెచ్చిస్తారనేది చాలా మందికి ఇప్పటివరకూ తెలియని విషయం. హైదరాబాద్‌ లో ఉండే ప్రజలకు కాస్తోకూస్తో తెలుసేమో కానీ.. ఇతర ప్రాంతాల్లోని ప్రజలకు బొత్తిగా తెలియదు. అందుకే ఆ బాధ్యతను జనంసాక్షి తీసుకుంది. ఆ పార్టీకి ఉన్న ప్రజాప్రతినిధులందరూ ప్రతిరోజూ ఆ నాలుగు గంటలు ప్రజాసేవలోనే తరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలోని ఎంఐఎం కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు మాత్రమే గాక పార్టీ ప్రతినిధులు సైతం శుక్రవారం మినహా మిగతా అన్నిరోజులూ దారుస్సలాంలోనే ఉంటారు. ప్రజల విజ్ఞాపనలు సాకల్యంగా వినడం, ఒకవేళ ఎవరైనా లిఖితపూర్వకమైన దరఖాస్తుతో రాకపోతే వారి సమస్యను టైప్‌ చేసి, ప్రింటవుట్‌ తీసి, సంబంధిత ప్రజాప్రతినిధి సంతకంతో ఆ పరిధిలోని అధికారికి నేరుగా సిఫార్సు చేయడం ఇక్కడ ప్రతినిత్యం జరుగుతుంది. దరఖాస్తును నిర్దిష్టమైన పద్ధతిలో టైప్‌ చేసి సంబంధిత అధికారికి అవసరమైతే ఫోన్‌ చేసి చెప్పడంతో వారి సమస్యలు సులభంగా పరిష్కారమైపోతున్నాయి. ఇలాంటి పనులన్నీ ఉచితంగా చేసి పెట్టేందుకు పార్టీ హైకమాండ్‌ అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయడం విశేషం. దీంతో ఇప్పుడు దారుస్సలాం అంటే కేవలం ఓల్డ్‌ సిటీకి పరిమితమైన ఆఫీసుగా కాక హైదరాబాద్‌ మొత్తాన్ని ఆకర్షించే ప్రజావేదికగా మారిందన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

ఇక మరో ముఖ్యవిషయం ఏంటంటే… ఎంఐఎం నేతలు హిందువుల పట్ల వ్యతిరేక భావంతో ఉంటారన్న ఆరోపణలు చాలాకాలంగా జనసామాన్యంలో ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం అనే కోణంలో కూడా జనంసాక్షి దృష్టి సారించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ప్రజల ఫిర్యాదుల పట్ల ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తున్నారో అధ్యయనం చేసింది. ప్రజలను నేరుగా అడిగి వారి అభిప్రాయాలు రికార్డు చేసింది. ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. తమ సమస్యల కోసం ముస్లింలు ఏ విధంగా ఇక్కడికి వస్తున్నారో..అంతే స్థాయిలో హిందువులు కూడా తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఏ ఒక్క హిందువు కూడా ఆ పార్టీ నేతలు గానీ, కార్యకర్తలు గానీ తమ పట్ల నిర్లక్ష్యభావంతో చూడలేదని, ఎలాంటి భేదభావం కనబరచలేదని పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. సిటీ పరిసరాలను ఆనుకొని, దారుస్సలాంకు ఎంతో దూరంలో ఉన్న మెదక్‌ జిల్లా, మేడ్చల్‌ వంటి జిల్లాల నుంచి కూడా తమ సమస్యల కోసం ప్రజలు దారుస్సలాం గడప తొక్కుతున్నారు. ప్రజల తాకిడితో ఎంఐఎం నేతలు కూడా మరింత ఉత్సాహంతో సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుండడం కనిపించింది. మొత్తానికి ముస్లిం మైనారిటీల పార్టీగా అందరూ భావిస్తున్న ఎంఐఎం ను చూసి ఇతర పార్టీలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న అభిప్రాయం సామాన్య జనం నుంచి వ్యక్తమవుతోంది.
ప్రజల సమస్యలే తప్ప మాకు మతం కనిపించదు:సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీ, ఎమ్మెల్యే
ఇదే విషయమై యాకుత్‌ పురా ఎమ్మెల్యే సయ్యద్‌ అహ్మద్‌ పాషాఖాద్రీని జనంసాక్షి స్పందన కోరింది. ప్రతిరోజూ ప్రజాప్రతినిధులైనా, పార్టీ ప్రతినిధులైనా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు దారుస్సలాంలో విధిగా ప్రజలకు అందుబాటులో ఉండాలనేది తమ పార్టీ పాలసీ అని, ఈ సంప్రదాయం కేవలం ఇప్పుడు మాత్రమే వచ్చింది కాదని, హైదరాబాద్‌ మాజీ ఎంపీ సలాఉద్దీన్‌ ఒవైసీ నుంచి కూడా అమలవుతూ ఉందని, అందువల్లనే తమను జనం ఇంతగా ఆదరిస్తున్నారని పాషాఖాద్రీ చెప్పారు.