ఎంతకష్టం..!

అలెప్పో: సిరియాలో నెలకొన్న కల్లోల పరిస్థితులకు సామాన్య ప్రజలు, చిన్నారులు ఎలా సమిధలౌతున్నారో తెలిపే ఓ బాలుడి చిత్రం ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఐదేళ్ల బాలుడు ఒళ్లంతా గాయాలతో అమాయకంగా చూస్తున్న చూపులు సిరియా అంతర్యుద్దాన్ని కళ్లకుకడుతోంది.

అలెప్పో ప్రాంతంలో తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని జరిపిన వైమానిక దాడుల్లో ఓ భవనం ధ్వంసమైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు, పాత్రికేయులు ఒమ్రాన్ అనే బాలుడి కుటుంబాన్ని రక్షించారు. ఒమ్రాన్ తో పాటు అతని ముగ్గురు సోదరులు, తల్లిదండ్రులు ఈ ఘటనలో గాయపడ్డారు. ఒళ్లంతా తీవ్రగాయాలై రక్తమోడుతున్న బాలుడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ బాలుడి ప్రాణానికి ప్రమాదమేం లేదని వైద్యులు వెల్లడించారు. ఒమ్రాన్ కుటుంబాన్ని భవనం నుంచి బయటకు తీసుకొచ్చిన కొద్ది సేపట్లోనే అది పూర్తిగా కుప్పకూలిందని స్థానికులు వెల్లడించారు.

ఒమ్రాన్ అంబులెన్స్ లో కూర్చున్న సమయంలో ఓ పాత్రికేయుడు తీసిన ఫోటో ఇది. ఒమ్రాన్ ఫోటోతో అంతర్జాతీయ సమాజం కదిలిపోయింది. సామాజిక కార్యకర్తలు, మానవహక్కుల సంఘాలు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ సైతం తక్షణమే అలెప్పోలో వైమానిక దాడులను నిలిపేయండి అని కోరింది.