ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు
దుబ్బాక ప్రచారంలో జీవన్ రెడ్డి ప్రశ్న
సిద్దిపేట,అక్టోబర్27(జనంసాక్షి): దుబ్బాకలో జరుగుతున్న ఉపఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి, అధికార దాహానికి మధ్య జరుగుతున్న పోటీ అని మాజీమంత్రి,ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. పలుగ్రామాల్లో , కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గొర్రెలు, బర్రెలు ఇవ్వడాన్ని తాము తప్పుపట్టడం లేదని, యువకులకు ఉద్యోగ కల్పనలో మాత్రం ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇంజనీరింగ్, పీజీలు చదవిన యువకులు గొర్రెలు, బర్రెలు కాయాలా? ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు లభించాయని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు కల్పించకపోగా కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.