ఎఐసిసి కోశాధికారిగా అహ్మద్‌ పటేల్‌

కరణ్‌సింగ్‌ స్థానంలో ఆనంద్‌ శర్మ

సిడబ్ల్యూసి శాశ్వత ఆహ్వానితురాలిగా విూరాకుమార్‌

రాహుల్‌ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ,ఆగస్టు 21(జ‌నం సాక్షి): సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కీలక నియామకాలు చేపట్టారు. పార్టీలో ఇటు యువనేతలకు, అటు అనుభవజ్ఞులైన నేతలకు సమ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన రాహుల్‌ తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఒకప్పుడు సోనియాగాంధీకి రాజకీయ కార్యదర్శిగా చక్రం తిప్పిన అహ్మద్‌ పటేల్‌ను పార్టీ కోశాధికారిగా నియమించారు. మోతీలాల్‌ ఓరా స్థానంలో అహ్మద్‌ పటేల్‌ నియమితులయ్యారు. మోతీలాల్‌ ఓరాను పాలనా వ్యవహారాలు చూసుకునే ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పార్టీ విదేశీ విభాగం కొత్త చైర్మన్‌గా ఆనంద్‌ శర్మ వ్యవహరిస్తారు. గత జూలైలో సీడబ్ల్యూసీ నుంచి దిగ్విజయ్‌ సింగ్‌, సుశీల్‌ కుమార్‌ షిండే, జనార్దన్‌ ద్వివేది వంటి సీనియర్‌ నేతలకు ఉద్వాస పలికిన నేపథ్యంలో తాజా నియామకాల్లో సీనియర్లకు పెద్దపీట వేశారు. ఇక కరణ్‌ సింగ్‌ స్ధానంలో పార్టీ విదేశీ వ్యవహారాల విభాగం చైర్‌పర్సన్‌గా మాజీ కేంద్ర మంత్రి ఆనంద్‌ శర్మను రాహుల్‌ నియమించారు. అసోం మినహా ఈశాన్య రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జ్‌గాలుజిన్హో సలేరియోను నియమించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలోకి మాజీ స్పీకర్‌ విూరా కుమార్‌ను శాశ్వత ఆహ్వానితులుగా నియమిస్తూ రాహుల్‌ నిర్ణయం తీసుకున్నారు.