ఎక్కడా లేని విదంగా ఎక్స్‌గ్రేషియా ఇప్పించిన చరిత్ర నాదే
అక్కెపల్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
– జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, మంథని : నాయకుడు సూక్ష్మంగా ఆలోచన చేసి పరిశీలన చేస్తే ఏదైనా చేయవచ్చని బీఆర్‌ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. సింగరేణి ఆర్జీ 3 పరిధి ఓసీపీ 2 ప్రాజెక్టు విస్తరణలో బాగంగా భూసేకరణలో నిర్వాసితులైన అక్కెపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తుర్కపల్లి భూనిర్వాసితులకు ఇంటి నివాస స్థల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ 2014లో ఎమ్మెల్యేగా అయిన తర్వాత సింగరేణి సంస్థ, భూసేకరణలాంటి విషయాలపై తనకు ఎక్కువగా అవగాహన లేదన్నారు. అయితే నాలుగేండ్ల కాలంలోనే అన్ని విషయాలపై అవగాహన పెంచుకుని చట్టాలు తెలుసుకుని మన ప్రాంతంలో ఎక్కువగా భూసేకరణ జరుగుతున్న నేపధ్యంలో నిర్వాసతులకు న్యాయం చేసే విధంగా ఆలోచన చేశామన్నారు. తాను ఎమ్మెల్యే కాకముందు సింగరేణి సంస్థ అనేక ప్రబావిత గ్రామాల్లో భూసేకరణ చేసిందని, గ్రామాలను స్వాధీనం చేసుందని, కానీ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగకపోగా నిర్వాసితులు చెల్లాచెదురై ఎక్కడడెక్కడో స్థిరపడిపోయారని ఆయన తెలిపారు. కానీ తన హయాంలో అలాంటి పరిస్థితులు రాకుండా ఆలోచన చేశామన్నారు. మన గురించి ఆలోచించే వాడు నాయకుడిగా ఉంటే ఏ విధంగా ఉంటుందో రచ్చపల్లి పునరావాస కాలనీని చూస్తే అర్థం అవుతుందన్నారు. తన హాయాంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూసేకరణ చేశామని, ఈ విషయంలో నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూశామన్నారు. సింగరేణి విషయంలో కూడా తాము ఓ అడుగు ముందుకు వేసి అధికారులను ఒప్పించి మెప్పించి నిర్వాసితులకు న్యాయం చేశామని ఆయన గుర్తు చేశారు. ఆనాడు సింగరెడ్డిపల్లి, పెద్దంపేట్, మంగలిపల్లి గ్రామాల నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే న్యాయం చేయలేదని, కానీ తాను ఎమ్మెల్యేగాఅయిన తర్వాత వారికి సైతం న్యాయం జరిగేలా చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి సంస్థ ద్వారా ఎక్స్‌గ్రేషియా ఇప్పించిన చరిత్ర మాదేనని అన్నారు. అంతేకాకుండా ఆడపిల్లలకు సైతం ప్యాకేజీ ఇప్పించామన్నారు. సింగరేణి సంస్థ ఇచ్చే పరిహరం సొమ్మును వృధాచేసుకోవద్దని, భవిష్యత్ గురించి ఆలోచన చేయాలన్నారు. అక్కెపల్లి గ్రామానికి సైతం పునరావాస కాలనీ ఏర్పాటుచేసి రచ్చపల్లి మాదిరిగా సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా అక్కెపల్లి నిర్వాసితుల విషయంలో మిగిలిపోయిన సమస్యలను పూర్తిస్థాయిలోపరిష్కారం చేసి న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.