ఎగువ నుంచి వరదతో సింగూరుకు పెరిగిన ప్రవాహం

నిండుకుండలా జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టులు
అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్‌

సంగారెడ్డి,జూలై14(జనం సాక్షి: వాగులు, వంకల్లో వరద ఉరకలెత్తుతున్నది. చెరువులు, చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకుతున్నాయి. జిల్లాలోని పుల్కాల్‌ మండలం బాగారెడ్డి సింగూర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వ పెరుగుతోంది. ఎగువ ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్ర నుండి సింగూర్‌ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ ఇన్‌ ప్లో 15 వేల 955 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా… ప్రస్తుతం నీటి నిల్వ 22.417 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నుండి దిగువకు నీటి ఔట్‌ ప్లో నిల్‌గా ఉంది. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉన్నది. వర్షానికి సంగారెడ్డి జిల్లాలోని సింగూరు, నారింజ, మంజీర, నల్లవాగు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. మెదక్‌ జిల్లాలో వనదుర్గా, పోచారం ప్రాజెక్టుల్లో వరద పరవళ్లు తొక్కుతున్నది. మంజీర నది, హల్దీ వాగుల్లో వరద ప్రవాహం కొనసాగుతున్నది. చెరువులు, చెక్‌డ్యామ్‌లు నిండుతున్నాయి. వర్షాలకు అనేక గ్రామాల్లో శిథిల ఇండ్లు కూలిపోయాయి. మంజీర తీర ప్రాంతంలో పంటలు నీటమునిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయ చర్యలు చేపడుతున్నారు. అల్పపీడనం కారణంగా ఐదారు రోజుల నుంచి కురుస్తున్న వర్షం ఇప్పుడిప్పుడే తెరిపినిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోని జలవనరులు పొంగిపొర్లు తున్నాయి. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటుండగా, చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు పంటపొలాల్లో పనులు చేసుకుంటుండగా, పలుచోట్ల పంట చేలల్లోకి వాననీరు చేరింది. ఆయా జిల్లాల్లోని పలుచోట్ల రోడ్లు దెబ్బతినగా, ఇండ్లు, చెట్లు కూలాయి. అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపవనాల రాకతో మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పుష్కలంగా పడ్డాయి. నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులను కలెక్టర్‌ శరత్‌ పరిశీలించారు. జిల్లాలోని పోచారం డ్యామ్‌, ఘనపూర్‌ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఇప్పటికే పోచారం డ్యామ్‌ పొంగిపొర్లుతున్నది. ఘనపూర్‌ ప్రాజెక్టు కూడా పొంగిపొర్లుతుండడంతో ఏడుపాయల వనదుర్‌గ్గా మాత ఆలయం ఎదుట నుంచి నీటి ప్రవాహం ఎక్కువైంది. అంతేకాకుండా జిల్లాలోని ఆయా మండలాల్లోని చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి.రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. ఎగువనుంచి సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకున్నది.