ఎట్టకేలకు లోక్‌పాల్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

14 సవరణలు.. లోక్‌పాల్‌ పరిధిలోకి సీబీఐ
న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి):
ఎట్టకేలకు కొత్త లోక్‌పాల్‌ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్‌ గురువారంనాడు ఆమోదం తెలిపింది. 14సవరణలతో ఈ బిల్లును కేబినెట్‌ ఆమోదించినట్టు సిఎంఓలో సహాయమంత్రి వి.నారాయణ స్వామి తెలిపారు. గురువారంనాడు ఆయన మీడియా సమావేశంలో లోక్‌పాల్‌ ముసాయిదా బిల్లు వివరాలను వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ లోక్‌పాల్‌ పరిధిలోకి వస్తుందని తెలిపారు. అలాగే ప్రభుత్వ అధికారులపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు ముందు వారి వాదనను వినేందుకు అవకాశం కల్పించినట్టు చెప్పారు. రాష్ట్రాలలో లోకాయుక్తల ఏర్పాటుకు సంబంధించి నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలివేసినట్లు చెప్పారు. రాష్ట్రాలలో లోకాయుక్త ఏర్పాటు ఏడాదిలోగా జరగాలని కొత్త లోక్‌పాల్‌ ముసాయిదా బిల్లులో పొందుపరిచినట్టు చెప్పారు. రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీ చేసిన పలు సిఫార్సులను కొత్త ముసాయిదా బిల్లులో పొందుపరిచినట్టు చెప్పారు. టివిసియే డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ను నియమించాలన్న సిఫార్సు కూడా వీటిలో ఉందన్నారు. రాజ్యసభ స్టాండింగ్‌ కమిటీ 16 సవరణలను ప్రతిపాదించగా వాటిలో 14 సవరణలను కేంద్రమంత్రి మండలి ఆమోదించిందన్నారు. ఈ కమిటీలో ప్రధాని, విపక్ష నేతతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి కూడా సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ అధికారులకు ఈ కొత్త బిల్లులో అధిక రక్షణ కల్పించినట్టు తెలిపారు. వారి అభిప్రాయాలను లోక్‌పాల్‌కు వేసులుబాటు కల్పించిందన్నారు. అయితే సెలెక్ట్‌ కమిటీ ప్రభుత్వ అధికారులకు ఆ అవకాశం ఇవ్వకూడదన్న సిఫార్సులను తోసిపుచ్చిందన్నారు. రాజ్యసభలో లోక్‌పాల్‌ బిల్‌పై వివిధ పార్టీల మధ్య విభేదాలు, బిల్లుపై విమర్శలు తలెత్తడంతో ఈ వివాదాన్ని సెలెక్ట కమిటీకి నివేదించారు. కొత్తగా రూపొందించిన ముసాయిదా బిల్లులో సిబిఐని లోక్‌ఫాల్‌ పరిధిలోకి తెచ్చారు. ప్రభుత్వ సహాయం పొందుతున్న స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, దేవాలయాలను లోక్‌పాల్‌ పరిధి నుంచి మినహాయించారు.
ప్రధానాంశాలు
– లోక్‌పాల్‌ పర్యవేక్షణలో సిబిఐ పనిచేస్తుంది.
– లోక్‌పాల్‌ ఆదేశాలతో కేసులను దర్యాప్తు చేసే అధికారులు సిబిఐలోనే కొనసాగుతారు. వారిని లోక్‌పాల్‌తో సంప్రదించకుండానే బదిలీ చేసే అవకాశం సిబిఐకి ఉంటుంది.