ఎన్ఎస్పీ అధికారుల నిర్లక్ష్యo తోనే సాగర్ ఎడమ కాల్వ కి గండ్లు

మిర్యాలగూడ. జనం సాక్షి : ఎన్నెస్పీ అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వలనే సాగర్ ఎడమ కాల్వ కి గండ్లు పడుతున్నాయని రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ రూ. 4,444 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో  నాగార్జునసాగర్ ఎడమ కాలువ లైనింగ్ పనులు చేసినప్పటికి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పనుల్లో నాణ్యత లేక నిడమనూరు మండల పరిధిలో ఎడమ కాల్వకి గండి పడి పంట పొలాలు కొట్టుకు పోయాయని, వారం రోజులు గడుస్తున్నా గండి పూడ్చటంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. మరమ్మతుల పేరుతో నీటి విడుదల ఆపడం వల్ల కాలువ కింద నారుమల్లు వరి పొలాలు ఎండి పోతున్నాయన్నారు. యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చి సాగునీటి విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. పనులు సకాలంలో పూర్తి చేయక బడ్జెట్ వ్యయం పెరిగి ఇంకా 15 చోట్ల లైనింగ్ ఇతర మరమ్మతులు చేపట్టాల్సి ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ ఎడమ కాలువ పనుల పై పర్యవేక్షణ పెంచి డ్యామేజ్ అయిన లైనింగ్ లతో పాటు మిగిలి పోయిన లైనింగ్  పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు.