ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన మంత్రులు

గుంటూరు, జనవరి18(జ‌నంసాక్షి) : ఎన్టీఆర్‌ 23 వర్థంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నేతలంతా శుక్రవారం ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. మంత్రులు కళావెంకట్రావు, నక్కా ఆనందబాబు, జిల్లా పార్టీ అధ్యక్షులు జివి.ఆంజనేయులు, ఎమ్మెల్సీలు వివి.చౌదరి, డొక్కా మాణిక్య ప్రసాద్‌, ఎమ్మెల్సీ రామకృష్ణ, టిడిపి నాయకులు కలిసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మంత్రి నక్కా ఆనందబాబు పార్టీ సీనియర్‌ నాయకులను ఘనంగా సన్మానించి, వారు పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ… తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ పేరు ఉంటుందని, సంక్షేమ పథకాల సృష్టికర్త ఎన్టీఆర్‌ అని చెప్పారు. పేదలందరికీ తిండి, బట్ట, ఇల్లు అందించడానికి ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఎన్టీఆర్‌ సిద్ధాంతాలు, ఆశయాలను తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకుని వెళుతుందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘ లెజండ్రి బ్లడ్‌ డోనేషన్‌ డ్రైవ్‌ ‘ కార్యక్రమంలో మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబులు పాల్గొన్నారు. మరో వైపు.. రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట మదర్‌ థెరిస్సా కాలనీలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.