ఎన్టీఆర్‌ కి ‘భారత రత్న’ ఇవ్వాలి

– తెదేపా గెలుపుకోసం సమిష్టిగా కృషి చేయాలి

– ఎన్టీఆర్‌ వర్థంతి వేడుకల్లో ఎన్‌డి.విజయజ్యోతి

కడప, జనవరి18(జ‌నంసాక్షి) : భారత ప్రభుత్వం నందమూరి తారక రామారావు కి ‘ భారత రత్న ‘ ఇవ్వడం ద్వారానే తెలుగు జాతిని గౌరవించి ఇచ్చే నిజమైన నివాళి అని తెలుగుదేశం పార్టీ బద్వేలు నియోజకవర్గ ఇంచార్జ్‌ ఎన్‌డి విజయ జ్యోతి పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌ 23 వ వర్ధంతి సందర్భంగా కలసపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో ఎన్‌డి.విజయ జ్యోతి మాట్లాడుతూ… నిజాయితీకి మారుపేరుగా, నమ్ముకున్న సిద్ధాంతాల కోసం చివరి వరకూ నిలబడి పోరాడిన ప్రజల మనిషి ఎన్టీఆర్‌ అని అన్నారు. తనకంటూ ఒక నిష్కళంక చరిత్రను ఎన్టీఆర్‌ సొంతం చేసుకున్నారని, చేపట్టిన ఏ పనిలో అయినా తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఘనత ఆయనకే సొంతమైందని తెలిపారు. ప్రతి నిరుపేదకు ఆత్మీయుడిలా అండగా నిలిచారని, ఎన్టీఆర్‌ జీవితం తెలుగు జాతికిచ్చిన కానుకవంటిదని, భారత ప్రభుత్వం ఎన్టీఆర్‌ కి భారతరత్న ఇవ్వడం ద్వారానే తెలుగు జాతిని గౌరవించి ఇచ్చే నిజమైన నివాళి అని ఆమె ఉద్ఘాటించారు. రామారావు ‘ సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్ళు ‘ అంటూ పేదరికం లేని సమాజానికి బాటలు వేసిన తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడని, కారణజన్ముడని, ఆయన ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అను నిత్యం తెలుగు జాతి అభ్యున్నతికి పాటుపడుతున్నారని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయానికి అందరం కలసి సమిష్టి కృషి చేయాలని విజయజ్యోతి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రామసుబ్బారావు, క్రిష్ణారెడ్డి, నారాయణరెడ్డి, శేఖర్‌ రెడ్డి, సుబ్బారెడ్డి, రుద్రవరం రాము, బాలవెంకటరెడ్డి, రామసుబ్బయ్య, మస్తాన్‌, నరసింహారెడ్డి, అల్లూరి రెడ్డి, ప్రసాద్‌, చౌడేశ్వరావు, వెంకట సుబ్బమ్మ, టిడిపి కార్యకర్తలు, ఎన్టీఆర్‌ అభిమానులు పాల్గొన్నారు.