ఎన్డీయేకే ఉపాధ్యక్ష పదవి

– రాజ్యసభ డిప్యూటీ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి నారాయణ్‌సింగ్‌ విజయం
– ఎన్డీయే అభ్యర్థికి 125, కాంగ్రెస్‌ అభ్యర్థికి 105 ఓట్లు
– 20ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నారాయణ్‌సింగ్‌
– ఓటింగ్‌కు దూరంగా ఆమ్‌ఆద్మీ, వైకాపా
న్యూఢిల్లీ, ఆగస్టు9(జ‌నం సాక్షి) : రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీయేనే విజయం వరించింది. ఎన్డీఏ అభ్యర్థి, జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ గెలుపొందాడు. నారాయణ్‌ సింగ్‌కు 125 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి టీడీపీ ఓటువేయగా, వైసీపీ మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉంది. రాజ్యసభలో అధికార పక్షానికి తగినంత మెజార్టీ లేకపోవడంతో ఈ ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్డీఏ కూటమికి 89 మంది సభ్యులు ఉండగా, బీజేడీ, అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ పార్టీల ఓట్లతో హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ గెలుపు సునాయాసమైంది. అంతకు ముందు విజయంపై ఇరు పక్షాలూ ధీమా వ్యక్తం చేశాయి. రాజ్యసభ ఛైర్మన్‌ ¬దాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ఎన్నికను నిర్వహించారు. బిహార్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న హరివంశ్‌ సభ్యత్వం 2020తో ముగియనుంది. సరిపడేంత మెజార్టీ లేకపోవడంతో ఈ ఎన్నికను బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
20 ఓట్ల మెజార్టీతో నారాయణ్‌ గెలుపు..
బుధవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తరువాత ఛైర్మన్‌ ¬దాలో
వెంకయ్యనాడు ఉపాధ్యక్ష పదవికి నామినేషన్లు వేసిన హరివంశ్‌, హరిప్రసాద్‌ పేర్లను ప్రకటించి ఓటింగ్‌ పక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అనంతరం లాబీలను క్లియర్‌ చేయాలని ఆదేశించారు. ఆపై మూజువాణీ ఓటు ద్వారా హరివంశ్‌ గెలిచినట్టు ప్రకటించారు. విపక్ష సభ్యులు డివిజన్‌ కావాలని పట్టుబట్టడంతో ఓటింగ్‌ నిర్వహించారు. డివిజన్‌ బెల్‌ మోగించారు. ఈ సమయంలో హరివంశ్‌ నారాయణ్‌ కు 115 ఓట్లు, హరిప్రసాద్‌ కు 89 ఓట్లు వచ్చాయి. సభలో మొత్తం 230 మంది ఉండగా, ఇద్దరు ఎంపీలు ఎవరికీ ఓటు వేయలేదని కౌంటింగ్‌ నంబర్‌ బోర్డు తెలిపింది. దీంతో హరివంశ్‌ నారాయణ్‌ విజయం సాధించారని వెంకయ్య నాయుడు ప్రకటించారు. కొంతమంది తాము పొరపాటు పడ్డామని, మరికొందరు ఓటు వేయలేదని ఫిర్యాదు చేయడంతో మరోసారి డివిజన్‌ చేశారు. అప్పుడు హరివంశ్‌ కు 125 ఓట్లు, హరిప్రసాద్‌ కు 105 ఓట్లు రాగా, ఇద్దరు ఎవరికీ ఓటు వేయలేదు. దీంతో హరివంశ్‌ గెలుపును వెంకయ్యనాయుడు ఖరారు చేశారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నారాయణ్‌ సింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత
గులాం నబీ అజాద్‌లు అభినందించారు.
ఎన్నికకు కాంగ్రెస్‌పై ఆమ్‌ఆద్మీ పార్టీ దూరం..
రాజ్యసభలో ప్రస్తుతం 244 మంది సభ్యులున్నారు. అయితే నేటి ఎన్నికకు ఆమ్‌ ఆద్మీ పార్టీ, వైకాపా సహా 14 మంది సభ్యులు దూరంగా ఉన్నారు. అయితే తాము పెట్టిన షరతుకు కాంగ్రెస్‌ అంగీకరించకపోవడం వల్లే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఆప్‌ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తమ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజీవ్రాల్‌తో మాట్లాడితే విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తామని ఆప్‌ తెలిపింది. అయితే ఓటింగ్‌ ముందు వరకూ రాహుల్‌.. కేజీవ్రాల్‌కు ఫోన్‌ చేయలేదట. దీంతో తాము ఎన్నికకు దూరంగా ఉండాలనే భావిస్తున్నట్లు ఆప్‌ వర్గాలు చెప్పాయి. ఇదే విషయమై సంజయ్‌ సింగ్‌ విూడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కౌగలించుకోగలరు.. కానీ మా పార్టీ అభ్యర్థికి మద్దతివ్వండి అని అరవింద్‌ కేజీవ్రాల్‌ను ఎందుకు అడగలేరు?’ అని ఎద్దేవా చేశారు.  మరోవైపు వైపాకా సైతం ఓటింగ్‌కు దూరంగా ఉంది.  తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం మేరకే ఓటింగ్‌ దూరంగా ఉండనున్నట్లు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి దిల్లీలో వెల్లడించారు. కాంగ్రెస్‌, భాజపా నిలబెట్టిన ఇద్దరు అభ్యర్థులకు మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. డిప్యూటీ ఛైర్మన్‌ అభ్యర్థిని నిలబెట్టబోమని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ.. చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయి తెలిపారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీ రెండూ ఆంధప్రదేశ్‌కు అన్యాయం చేశాయని.. అందుకే రెండు పార్టీల అభ్యర్థులకు మద్దతివ్వడం లేదన్నారు. కాంగ్రెస్‌ కాకుండా ప్రతిపక్షంలో ఉన్న ఇతర ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నా మద్దతిచ్చేవారమని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.