ఎన్నాళ్లీ రూపాయి పతనం

దిద్దుబాటు చర్యలపై కానరాని ఆసక్తి
నిపుణలుతో చర్చించే చొరవ చూపని ప్రధాని
న్యూఢల్లీి,జూలై120(జ‌నంసాక్షి): ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి తీవ్ర ఒడిదుడుకుల్లోనే ట్రేడ్‌ అవుతున్నది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పతనమైంది. దేశీయ కరెన్సీ.. ఒకానొక దశలో మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి 80.05 స్థాయిని తాకింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన మద్దతు రూపాయిని ముంచేస్తున్నది. అయితే ఆఖర్లో గత ముగింపుతో పోల్చితే 6 పైసలు కోలుకుని 79.92 వద్ద స్థిరపడిరది. రూపాయి మారకం విలువ డాలర్‌తో చూస్తే 82 స్థాయికి రాబోయే రోజుల్లో పతనం కావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎగుమతుల కంటే దేశ దిగుమతులు ఎక్కువగా ఉండటం, దేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ పెట్టుబడులు క్షీణిస్తుండటమే ఇప్పుడు ప్రధానంగా రూపాయి విలువను వేగంగా దిగజార్చుతున్నాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిని అడ్డుకునే ప్రయత్నాలు సాగడం
లేదు. అలాగే నిపుణుల సలహాలు తీసుకోవడం లేదు. దేశంలో చర్చ చేయడం లేదు. పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. గ్లోబల్‌ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటం కూడా రూపాయిని ఒత్తిడికి లోనుచేస్తున్నాయని అంటున్నారు. సెప్టెంబర్‌దాకా రూపాయి మారకం విలువ 78.5`81 మధ్యే ఉండొచ్చని రెలిగేర్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ కమోడిటీ, కరెన్సీ రిసెర్చ్‌ ఉపాధ్యక్షుడు సుగంద సచ్‌దేవ అంచనా వేశారు. అయితే దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగుస్తుండటం రూపాయికి కొంత జోష్‌ను తెస్తున్నదని ఫారెక్స్‌ మార్కెట్‌ ట్రేడర్లు తాజా సరళిని అభివర్ణిస్తున్నారు. మంగళవారం ఉదయం నష్టాల్లో కదలాడి చివరకు స్టాక్స్‌ సూచీలు కూడా లాభపడ్డాయి. తదనుగుణంగానే రూపాయీ పుంజుకున్నది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోక్యం కూడా కలిసొచ్చిందంటున్నారు.ఎనిమిది సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ సాధించిన ఘనతలు లేదా విజయాలు అంటూ నిత్యం వండి వారుస్తున్న కథనాలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. రూపాయిని పట్టుకుంటే తెలిసిపోతుంది. మన దేశం కొనుగోలు చేస్తున్న ముడి చమురు ధర పదేండ్ల నాటి స్థాయికి పెరిగిందన్న వార్తలను కొట్టిపారేయలేం. 2011`12 లో మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర 111.89 డాలర్లు. ఆ ఏడాది అంటే 2012 మార్చి నెలలో ఉన్న సగటు ధర 123.66 డాలర్లుంది. 2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండు వరకు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఎసి వెల్లడిరచిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. ఇక్కడే మనం నరేంద్ర మోడీ ఘనత గురించి చెప్పుకోవాలి. అదే ధరకు 2012లో మన చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రూ. 6,201.05 కాగా, ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్ర మోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రూ. 9,434.29. అంటే మంచి రోజుల పేరుతో అధికారాన్ని పొంది బాదిన తీరును,చమురు విూద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రూ. 3,233.24 చెల్లిస్తున్నాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా, మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, పదమూడవ తేదీన 78.29 కి పతనమై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. అందువలన పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్ర మోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపి వేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.శ్రీలంక పరిణామాలను చూసిన తరువాత ఇప్పుడు ధరల పెరుగుదలను అరికట్టేందుకుగాను కొంత మేర పన్ను తగ్గింపు, ధరల స్తంభన కానసాగిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల ద్రవ్యోల్బణ రికార్డును మోడీ సర్కార్‌ అధిగమించింది. పెట్రోలు, డీజిలుకు కూరగాయల సాగుకు నేరుగా సంబంధం లేకున్నా రవాణా,సాగు, ఇతర ఖర్చు పెరిగి వాటి ధరలు కూడా పెరుగుతాయి. చమురు దిగుమతులను తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గత ఎనిమిదేండ్లలో ఉన్న ఉత్పత్తిని కూడా కొనసాగించలేని స్థితిలోకి చమురు సంస్థలను నెట్టారు. ఉక్రెయిను సంక్షోభానికి ముందు వరకు రష్యా నుంచి పెట్రోలు, డీజిలు, పెట్రోలియం ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకునేది. ఇప్పుడు ఉక్రెయిను సంక్షోభం కారణంగా మన దేశంలో జనం ధరల పెరుగుదలతో అల్లాడిపోతుంటే రష్యా నుంచి చవకగా దిగుమతి చేసుకున్న ముడి చమురును శుద్ధి చేసి ఐరోపా దేశాల కోసం ఎగుమతి చేస్తున్నారంటే దీని వలన లబ్ది పొందేది ఎవరన్నది ఆలోచించాలి. ఐరోపా దేశాల నుంచి వాటికి ప్రతిగా నరేంద్ర మోడీ పలుకుబడితో తక్కువ ధరలకు సరకులను దిగుమతి
చేసుకుంటున్నామా అంటే అదీ లేదు. మొత్తంగా కార్యదక్షత లేని నాయకుడి నిర్ణయాల కారణంగా మనం నష్టపోతున్నాం. ద్రవ్యోల్బణం అరికట్టలేకపోతున్నాం. రూపాయి పతనాన్ని అడ్డుకోలేక పోతున్నాం.