ఎన్నికలున్నాయ్‌.. విచారణ చేయలేం

– 35-ఏ అధికరణాన్ని వ్యతిరేకిస్తూ సుప్రింకోర్టులో పిటీషన్‌ దాఖలు
– జనవరి రెండోవారంలో విచారణ చేపడతామన్న న్యాయస్థానం
న్యూఢిల్లీ, ఆగస్టు31(జ‌నం సాక్షి) : జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని 35-ఏ అధికరణాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణను వచ్చే ఏడాది జనవరి వరకు విచారించబోమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. శుక్రవారం దీనికి సంబంధించిన పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు 2019 జనవరి రెండో వారంలో విచారణ చేస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని, సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య వరకు జమ్ముకశ్మీర్‌లో ఎనిమిది దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నామని, ఇప్పుడు ఆర్టికల్‌ 35ఏ వంటి సున్నితమైన అంశం గురించి చర్చలు జరిగితే.. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల ముందు ఎన్నికలు ప్రశాంతంగా జరగనివ్వండి, ఆ తర్వాత దీనిపై చర్చలు చేపట్టొచ్చు అంటూ జమ్ముకశ్మీర్‌, కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టుకు ప్రతిపాదన పెట్టారు. కేంద్రం ప్రతిపాదనను పరిశీలించిన సుప్రీంకోర్టు అందుకు అంగీకారం తెలిపింది. వచ్చే ఏడాది జనవరి వరకు దీనికి సంబంధిన ఎటువంటి విచారణ చేపట్టబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. జనవరి 19న దీనికి సంబంధించి తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కట్టబెట్టే రాజ్యాంగంలోని ఆర్టికల్‌-35ఏ అధికారణను రద్దు చేయాలని, దీని వల్ల జమ్ముకశ్మీర్‌కు మిగతా రాష్ట్రాలకు మధ్య రాజకీయ అంతరాన్ని పెంచుతుందని సవాల్‌ చేస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో తొలిసారిగా పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో పాటు మరికొంత మంది కూడా 35ఏను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. పలు రాజకీయ పార్టీలు 35ఏ అధికరణాన్ని సమర్థిస్తుండగా.. మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు.