ఎన్నికల ఏడాదితో పందాలకు జోరు

కృష్ణా జిల్లాలోనూ పెరిగిన ఆసక్తి

మచిలీపట్టణం,జనవరి14(జ‌నంసాక్షి): కోడి పందాలకు బరులు సిద్ధమవుయ్యాయి. ఖాళీ ప్రదేశాల్లో, పొలాల్లో భూమిని చదనుచేసి పందాలు ఆడుతున్నారు. గతేడాది కంటే ఎక్కువగా ఒక్క కృష్ణా జిల్లాలో దాదాపు రూ.150 కోట్ల మేరకు పందాలు జరిగేందుకు ఏర్పాట్లు జరిగాయని నిఘావర్గాల సమాచారం. వీటిని నిర్వహించవద్దంటూ అధికారులు నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తున్నా రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని సంప్రదాయ పోటీలు అంటూ న్యాయస్థానాల్లో పిటిషన్‌లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాలు హింస జరగకుండా పందేలు వేసుకోవాలని చివరి క్షణంలో తీర్పులను ఇస్తున్నాయి. దీంతో అప్పటివరకు ఉన్న ఉత్కంఠ తొలగిపోవడంతో ప్రజలు కోడి పందేలు జరపడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో బరుల వద్ద కోడిపందేలు జరగకుండా నియంత్రించాల్సిన పోలీసులు అక్కడి నుంచి వైదొలగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనంతరం కోడికి కత్తి కట్టకుండా డింకీ పందాలు వేయాల్సి ఉండగా కత్తులు కట్టి యధావిధిగా నిర్వహిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలను మించి కృష్ణా జిల్లాలో కోడిపందాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గతేడాది సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పోలీసులు మొదట్లో హాడావుడి చేసినా తర్వాత మౌనంగా ఉండిపోయారు. ప్రస్తుతం ఎన్నికల ఏడాది కావడంతో రాజకీయ నాయకులు పందేలకు దూరంగా ఉన్నప్పటికీ.. పందాలు నిర్వహించుకోవచ్చని సూచనలు ఇవ్వడంతో బరుల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కృష్ణా జిల్లాలో ఇప్పటికే అక్కడక్కడా కోడి పందేలు మొదలయ్యాయి. పోలీసుల కళ్లుగప్పి నిర్వాహకులు రూ.లక్షల్లో పందేలు వేస్తున్నారు. కోడికి కత్తులు, బెట్టింగ్‌లతో కూడిన పందేలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని, కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. కొన్నిచోట్ల కోడిపందేల బరులను ధ్వంసం చేస్తుండటంతో కబడ్డీ, ఇతర క్రీడా పోటీలు నిర్వహిస్తామని చెబుతూ సిద్ధం చేస్తున్నారు.ఓ వైపు పోలీసులు హెచ్చరికలు సాగుతున్నా.. ఇవి తమకు మామూలేనంటూ పందెగాళ్లు ఎవరి పనుల్లో వాళ్లున్నారు. పందెం కోసం వినియోగించే బరిని సిద్ధం చేయడంతో పాటు.. అక్కడ గుండాట, పేకాట వంటి జూదాల నిర్వహణకు వేలంపాటలు సాగుతున్నాయి. మద్యం షాపుల ఏర్పాటుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో జరిగే కోడి పందేల స్థాయిని బట్టి గుండాట, పేకాట నిర్వాహకులను ఎంపిక చేస్తున్నారు.