ఎపిలోనూ ఐక్య కూటమి ఏర్పాటు
బిజెపి,టిడిపిలకు బుద్ది చెబుతాం
విజయవాడ గర్జనలో మధు వెల్లడి
విజయవాడ,సెప్టెంబర్15(జనంసాక్షి): వామపక్షాలు, జనసేన, బీఎస్పీ, లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ పార్టీలతో ఐక్య కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన వామపక్షాల మహాగర్జనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు, జనసేన, బీఎస్పీ, లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు మహాగర్జనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఇసుక, మద్యం మాఫియాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయని , మహిళలకు రక్షణ కరవైందని విమర్శించారు. సుపరిపాలన తీసుకురావడంలో భాజపా, తెదేపా విఫలమయ్యాయన్నారు. దేశ వ్యాప్తంగా బంద్ చేపట్టినా పెట్రోల్ ధరలు పెంచుతూనే ఉన్నారని మధు విమర్శించారు.చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాగర్జన సభలో ఆయన మాట్లాడారు. రైతులందరూ సంతోషంగా ఉన్నారని దేవినేని ఉమా అంటున్నారని, ఒక్కసారి కడప గానీ, అనంతపురం గానీ వెళ్ళి చూస్తే రైతుల దీనస్థితి తెలుస్తుందన్నారు. వైఎస్ జగన్‌ది సింగిల్ ఎజెండా అని, సిఎం సీటు మాత్రమే ఆయన తపన, తాపత్రయం ప్రజాసమస్యలు ఆయనకు పట్టవన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారాట్ తదితరులు బహిరంగ సభలో పాల్గొన్నారు. టిడిపికి, బిజెపికి బుద్ధి చెబుతామని, మోడీ, బాబు పోవాలంటే దానికి ఇదొక చారిత్రక ఆరంభమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ అన్నారు. చంద్రబాబు, మోడీ గ్దదెదిగడం ఖాయమని, రైతు, కార్మిక, దళిత, మైనార్టీ, మహిళ, ఎస్సీ, ఎస్టీల ప్రత్యామ్నాయ వేదికే మహాగర్జన అని అన్నారు. కార్పొరేట్, ఆరెస్సెస్ జాయింట్ వెంచర్‌తో ప్రభుత్వం నడుస్తూ..దేశాన్ని నాశనం చేస్తున్నారు. నోట్ల రద్దుతో 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఆరెస్సెస్ అంటే రాష్టీయ్ర సర్వ నాశన్ సంస్థ అని తెలిపారు. చంద్రబాబు, మోడీ లాలూచి కుస్తీ పడుతున్నారన్నారు. చంద్రబాబుకి మోడీ పెద్దన్నలాంటి వాడన్నారు. చంద్రబాబు ఇండియాలోనే నమ్మకూడని నాయకుడని, చంద్రబాబు ప్రజలపై దాడి చేస్తుంటే వైసిపి ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. బిజెపితో మిలాఖత్ అయిన టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తామన్నారు. దళితులపై, మైనార్టీలపై, మహిళలపై దాడులు చేస్తున్న నేరస్తులకు బిజెపి సర్కార్ మద్దతు ఇస్తుంటే…వైసిపి ఎందుకు నోరు మెదపదన్నారు. మహిళలు ఐక్యంగా కదిలితే మార్పు అనివార్యమని, ఎర్రజెండా పట్టుకుని సాగితే..ఎవరూ ఆపలేరని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు అన్నారు.