ఎఫ్‌డీఐలపై యూపీఏను సమర్థించబోం : డీఎంకే

చెన్నై : మల్టీబ్రాండ్‌ రిటైల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)ను అనుమతించడంపై డీఎంకే ఎట్టకేలకు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించబోమని డీఎంకే అధినేత కరుణానిధి తేల్చిచెప్పారు. ఎఫ్‌డీఐ అంశం మీద తన అభిప్రాయాన్ని ఇప్పటివరకు వెల్లడించని డీఎంకే ఇప్పుడు తాను భాగస్వామిగా ఉన్న యూపీఏను వ్యతిరేకిస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం చర్చనీయాంశమైంది. సోమవారం చెన్నైలో విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ అంశంమీద తమ పార్టీ అభిప్రాయాన్ని కరుణానిధి స్పష్టీకరించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తమను తీవ్రంగా దెబ్బతీస్తాయని తమిళనాడులోని చిన్న, మధ్యతరగతి వ్యాపారులు భయపెడుతున్నారని, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాము చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని కరుణానిధి గతవారం చెప్పారు.