ఎమ్మెల్యేగా నోముల భగత్‌ ప్రమాణం


ప్రమాణం చేయించిన స్పీకర్‌ పోచారం
హాజరైన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): నాగార్జునసార్‌ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్‌ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే ఆయన సభ్యుడిగా ప్రమాణం చేయాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల వాయిదా పడిరది. చివరకు గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అసెంబ్లీ రూల్స్‌ బుక్స్‌, ఐడెంటిటీ కార్డును భగత్‌ కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్‌, భాస్కర్‌ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు తదితరులు పాల్గొన్నారు. నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హఠాన్మరణంతో ఆ నియోజకవర్గానికి గత ఏప్రిల్‌ 17న ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో దివంగత నరసింహయ్య కుమారుడు నోముల భగత్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేశారు. తన సవిూప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిపై భారీ మెజారిటీతో భగత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే.