ఎమ్మెల్యేల కొనుగోలుపై కేసు నమోదు

` రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్‌లను అరెస్టు
` నాకు రూ.100కోట్లు.. నాతో చేరేవారికి రూ.50కోట్ల ఆఫర్‌ ఇచ్చారు
` బీజేపీలో చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేస్తామని బెదిరించారు : రోహిత్‌రెడ్డి
` ఎమ్మెల్యే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెరాస ఎమ్మెల్యే కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారంలో ముగ్గురిపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దిల్లీకి చెందిన సతీశ్‌ శర్మ అలియాస్‌ రామచంద్ర భారతి(ఏ1), హైదరాబాద్‌కు చెందిన నందకిశోర్‌(ఏ2), తిరుపతికి చెందిన సింహయాజి (ఏ3)పై కేసు నమోదు కేసినట్లు రాజేంద్రనగర్‌ ఏసీపీ తెలిపారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలను పోలీసులు పొందుపర్చారు.భాజపాలో చేరితే రూ.100కోట్లు ఇప్పిస్తామని రోహిత్‌రెడ్డికి సతీష్‌ శర్మ అలియాస్‌ రామచంద్ర భారతీ ఆఫర్‌ చేశారని.. నందకిశోర్‌ (నందు) మధ్యవర్తిత్వంతో ఫామ్‌హౌస్‌కు సతీష్‌ శర్మ, సింహయాజి వచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. తెరాసకు రాజీనామా చేసి భాజపాలో చేరితే రూ.100కోట్లు ఇస్తామని భాజపా తరఫున వారు హావిూ ఇచ్చినట్లు పైలట్‌ రోహిత్‌ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఆ పార్టీలో చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లుగా ఆయన పేర్కొన్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు. భాజపాలో చేరితే సెంట్రల్‌ సివిల్‌ కాంట్రాక్టులతోపాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామని హావిూ ఇచ్చారంటూ రోహిత్‌ రెడ్డి చెప్పిన విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు. తనకు రూ.100కోట్లు, తనతో ఆ పార్టీలో చేరే వారికి రూ.50కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేసినట్లు రోహిత్‌ రెడ్డి తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల విచారణ వేగవంతం
తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన వ్యవహారంపై విచారణను పోలీసుల వేగవంతం చేశారు. మొయినాబాద్‌ సవిూపంలోని ఫాంహౌస్‌లో పట్టుబడిన ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు.వారిని పోలీసు అధికారులు రహస్య ప్రాంతాల్లో ఉంచి విచారిస్తున్నారు. బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై కూపీ లాగుతున్నట్లు సమాచారం. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరించిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రలోభాలకు గురిచేయడం, బేరసారాలకు పాల్పడటంపై మొయినాబాద్‌ పీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.మరోవైపు ఫామ్‌హౌస్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని పరిశీలిస్తున్నారు. ఇతరులెవరినీ లోనికి అనుమతించడం లేదు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ఫామ్‌ హౌస్‌కు డబ్బు తెచ్చారా? తెస్తే ఎక్కడ దాచారు? అనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు. శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు పూర్వాపరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే తెలుగు రాష్ట్రాల్లో అంశం సంచలనం సృష్టించింది. సైబరాబాద్‌ పోలీసులు తమకు అందిన సమాచారంతో హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేశారు. తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్‌, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. ‘డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ తమను కొందరు ప్రలోభపెడుతున్నట్లు తెరాస ఎమ్మెల్యేలు సమాచారం ఇవ్వగా సోదాలు నిర్వహించాం. అజీజ్‌నగర్‌లోని ఫాంహౌస్‌లో కొందరు సమావేశమయ్యారని తెలిసింది. దిల్లీలోని ఫరీదాబాద్‌ ఆలయంలో ఉండే రామచంద్రభారతి అలియాస్‌ సతీశ్‌శర్మ వీరితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఫాంహౌస్‌లో రామచంద్రభారతితోపాటు తిరుపతికి చెందిన స్వావిూజీ సింహయాజి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ ఉన్నారు. నందకుమార్‌ వీరిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రలోభపెడుతున్నట్లు సమాచారం అందింది. దర్యాప్తు చేసి పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తాం. న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం’ అని రవీంద్ర చెప్పారు.ఎమ్మెల్యేలకు నగదు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర చెప్పగా.. డబ్బు ఎంత పట్టుకున్నారనే విషయంలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇచ్చేందుకు డీల్‌ కుదిరినట్లు తెరాస నాయకులు చెబుతున్నారు.

(ఎమ్మెల్యేల కొనుగోళ్లపై భగ్గుమన్న టిఆర్‌ఎస్‌
రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనల హోరు
మోడీ, బిజెపి దిష్టిబొమ్మల దహనం
టిఆర్‌ఎస్‌ జోలికి వస్తే ..ఖబర్దార్‌ అంటూ హెచ్చరికలు
హైదరాబాద్‌(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్‌ఎస్‌ నిరసనలతో హోరెత్తించింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు బీజేపీ, ప్రధాని మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు.పలు జిల్లాల్లో కార్యకర్తలు, నేతలు నిరసనలు చేపట్టారు.  బిజెపి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.  మోడీ తీరును ఎండగడుతూ విమర్శలు చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌ భాస్కర్‌, బాల్క సుమన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం కేంద్రంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ట్రాప్‌ చేసేందుకు కుట్ర పన్నిన సంఘటనకు వ్యతిరేకంగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను పార్టీ నాయకులు దగ్ధం చేశారు. అనంతరం తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసనలు తెలిపారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖమ్మంలోని ఎల్కనూరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్‌ నాయకులు కాల్చివేశారు. ఆసీఫాబాద్‌ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు ఆధ్వర్యంలో పీఎం నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజర య్యారు. ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రమే ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. చౌటుప్పల్‌ మండలం డి నాగారం గ్రామంలో స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి బీజేపీ దిష్టిబొమ్మను మంత్రి దహనం చేశారు. అధికారపార్టీకి చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్రలు పన్నిన బీజేపీ నాయకుల వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ మెదక్‌ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని రాందాస్‌ చౌరస్తాలో మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ ప్రభుత్వం తెర తీసిందని విమర్శించారు. ప్రశాంతంగా నడుస్తున్న సర్కారును పడగొట్టాలని కుట్ర చేశారని, అందులో భాగంగానే ఒక్కో ఎమ్మెల్యేను రూ.100 కోట్లతో కొనాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు చంద్రబాబు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనాలని రేవంత్‌ రెడ్డి ద్వారా కుట్రలు చేసి దొరికిపోయారని, ఇప్పుడు బీజేపి నేతలు అదే చేయబోయి భంగపడ్డారని ఆరోపించారు. అదాని, అంబానీలకు దేశాన్ని తాకట్టుపెట్టగా వచ్చిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తున్నదని, సీఎం కేసీఆర్‌ ముందు బీజేపీ కుప్పిగంతులు సాగవని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ దే అన్నారు. ఈ నిరసన కార్యక్రమం లో పట్టణ కార్యదర్శి గడ్డవిూద కృష్ణ గౌడ్‌,మున్సిపల్‌ కౌన్సిలర్లు ఆర్‌ కే శ్రీనివాస్‌, సమియొద్దీన్‌ కిషోర్‌, జయరాజ్‌,నాయకులు రాగి అశోక్‌,ప్రభు రెడ్డి, శ్రీధర్‌ యాదవ్‌, మధుసూదన్‌ రావు, దుర్గాప్రసాద్‌, ప్రవీణ్‌ గౌడ్‌, అరవింద్‌ గౌడ్‌, మంగ. రమేష్‌ గౌడ్‌, మధు,శంకర్‌, ఆడవయ్య, ఉమర్‌, జుబేర్‌,బానీ, మహమ్మద్‌, నగేష్‌, బాలరాజు,పెరికె. కిషన్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు పర్వంలోకి స్వామిజీలను దింపడం సిగ్గు చేటని, ఇది బీజేపీ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఎన్నో ప్రలోభాలు పెట్టి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన కుట్రలను తెలంగాణ పోలీసులు బట్టబయలు చేశారని వెల్లడిరచారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆద్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంస్థాన్‌ నారాయణపురం మండలం సర్వేల్‌ గ్రామంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ను గెలిపించి బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఆ పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడిరచి తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని నిరూపించాలన్నారు. హిందుత్వ పేరుతో హిందూ మత గౌరవాలను, విశ్వాసాలను బీజేపీ మంటగలిపే ప్రయత్నాలు చేస్తుందని, దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ సమాజం వాటిని తిప్పికొడుతుందని వెల్లడిరచారు. 14 ఏండ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మనసును గెలుచుకున్నారని, మిగితా రాష్టాల్లో మాదిరిగా ఇక్కడ బీజేపీ ఆకర్ష్‌ పని చేయదని, రానున్న రోజుల్లో కమలం పువ్వు వాడిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు.