ఎమ్మెల్యే హత్యకు.. ఇంటలిజెన్స్ వైఫల్యమే కారణం
– ఇంటెలిజెన్స్ అధికారులను తెలంగాణలో పెట్టారు
– అందుకే ఏపీలో మావోలు రెచ్చిపోయారు
– 2014 తర్వాత పోలీస్ విభాగం దిగజారిపోయింది
– అధికారులు కేవలం ప్రోటోకాల్ సేవలకే పరిమితమయ్యారు
– ప్రతిపక్షాలన్నీ ఏకమై మోదీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి
– ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
విజయవాడ, సెప్టెంబర్24(జనంసాక్షి) : విశాఖ మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హత్య చేయడంలో ఇంటలిజెన్స్ వైఫలమ్యే కారణమని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధప్రదేశ్ లో ఇంటెలిజెన్స్ అధికారులను తెలంగాణ ఎన్నికలకు వినియోగించడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని విమర్శించారు. 2014 తర్వాత ఏపీలో పోలీస్, నిఘా వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయాయని వెల్లడించారు. పోలీసులు ప్రోటోకాల్ సేవలకే పరిమితమయ్యారని కన్నా తెలిపారు. సమస్యల పరిష్కారానికి మావోలు ప్రాణాలు తీయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి ఘటనలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై మోడీ పైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. ఏడాదిన్నరగా రాహుల్ గాంధీ చంద్రబాబుతో స్నేహం చేయడం వల్లనే రాహుల్ గాలి
వార్తలను ప్రచారంగా మలుచుకోవడం జరుగుతుందని, అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసేలా రాహుల్ ప్రయత్నిస్తున్నారని కన్నా అన్నారు. దేశ రక్షణ వ్యవస్ధ మెరుగుపడకూడదని ప్రతిపక్షాలు కుట్రపన్నుతున్నాయని విమర్శించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో దేశానికి, ప్రైవేట్ కంపెనీలకు ఎటువంటి సంబంధం లేద పేర్కొన్నారు. లాలూ ప్రసాద్, చంద్రబాబు లాంటి అవినీతిపరులు రాఫెల్‌లో అవినీతి జరిగిందని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. యుద్ధ విమానాలను దేశంలోనే తయారు చేయాలన్నదే మోడీ ఆకాంక్ష అని కన్నా పేర్కొన్నారు. 2007లో యూపీఏ హయాంలోనే రాఫెల్ యుద్ద విమానాల కోసం టెండర్లు పిలిచారని గుర్తుచేశారు. విమానాల కొనుగోలుకు మోదీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. లోకల్ అసిస్టెన్సీ కోసమే రిలయన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక జరగిన కుంభకోణాన్ని జరిగినట్లు చిత్రీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ధర విషయంలో అనుమానాలుంటే కాగ్‌తో విచారణ జరిపించుకోవాలని ఆరుణ్ జైట్లీ విసిరిన సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఏపీలో పర్యావరణం ఎంత దుర్మార్గంగా ఉందో అందరికీ తెలుసని, ఎర్ర చందనం అక్రమ రవాణా, అడవులన్నీ కొట్టించేయడం వల్ల ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల్లో చెరువుల్లో మట్టిని, ఇసుకను తవ్విన చంద్రబాబు పర్యావరణ గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక ఏజెన్సీ పిలిస్తే చంద్రబాబు అమెరికా పర్యటన వెళ్లారని.. అంతేకానీ ఐక్యరాజ్యసమితి సమావేశానికి వెళుతున్నట్లు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు మళ్లీ వ్యవస్యాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.