ఎమ్మెల్సీ ఎన్నికలతో కేంద్రానికి కళ్ళు తెరిపించండి ఎమ్మెల్యేల విజ్ఞప్తి
కరీంనగర్, జనవరి 31 (): ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తెలంగాణ వాదాన్ని వినిపించి కేంద్రానికి కళ్ళు తెరిపించాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. స్థానిక ఉద్యోగ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు స్వామిగౌడ్, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సుధాకర్‌రెడ్డిలు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారంనాడు సర్కస్ గ్రౌండ్‌నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ఎత్తున టిఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజలు ప్రదర్శనగా వెళ్ళి వారు ఇరువురునామినేషన్లకు దాఖలు చేశారు. ప్రదర్శనలో ఎమ్మెల్యేలు ఇటేల రాజేందర్, హరీష్‌రావు, తారకరామారావు, కొప్పుల ఈశ్వర్, రమేష్‌బాబు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎస్‌సత్యనారాయణ, ఎంపి విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్కస్ గ్రౌండ్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందన్న విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరోమారు తెలియజేసేలా వీరిద్దరిని ప్రజలు గెలిపించాలని అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం సకల జనుల సమ్మెను పది జిల్లాలో విజయవంతంగా నడిపించి ఉద్యోగులను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత స్వామిగౌడ్‌కే దక్కుతుందని అన్నారు. అలాంటి పోరాట యోథుడు స్వామిగౌడ్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించే దిశలో విద్యారంగంలో మార్పుల కోసం ప్రభుత్వంతో పోరాడిన సుధాకర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా తిరిగి గెలిపించాలని వారు కోరారు. విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణ వాదులను ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని ఖండించారు. తెలంగాణ వాదుల అరెస్టులు చేయించేందుకు సీమాంధ్ర నేతలు ఒక పనిగా పెట్టుకున్నారని వారు ఎఇ్న అడ్డంకులు పెట్టినా తెలంగాణ వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. అరెస్టులకు వెరవబోమని ఆమె అన్నారు. తెలంగాణప్రాంతంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలను టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని అన్నారు.