ఎమ్మెల్సీ ఎన్నికల్లో మర్రికి మళ్లీ మొడిచేయి

 

అనూహ్యంగా పలువురు పేర్లుమారుతన్న సవిూకరణాల నేపథ్యంలో కూర్పు

గుంటూరు,నవంబర్‌22  (జనం సాక్షి) : ఆ ఇద్దరు అనూహ్యంగా ట్రాక్‌ విూదకు వచ్చారు. వస్తూ వస్తూనే పదవి ఎగరేసుకుని పోయారు. ఈసారి తమకు ఖాయం అనుకున్న నేతలు నోరెళ్లబెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్ధుల ఎంపికపై వైసీపీ హైకమాండ్‌ కొద్దిరోజులుగా కసరత్తు చేసి సామాజికవర్గాల ఈక్వేషన్స్‌లో 50`50 శాతం రేషియో పాటిస్తున్న సీఎం జగన్‌ ఈసారి కూడా అదే ఫ్రేమ్‌వర్క్‌లో అభ్యర్ధుల ఎంపిక చేపట్టారు. ఈ లెక్కల్లోనే పార్టీ అధినేత గతంలో ఇచ్చిన హావిూలకు దగ్గరగా ఉన్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి కొనసాగింపు అంశం ముందు నుంచి స్పష్టంగా ఉంది. మిగిలిన ఇద్దరిలో ఒకరు బీసీ, ఇంకొకరు మైనార్టీ. ఈ లెక్కకూడా సరిపోయింది అనుకున్నారు పార్టీ నేతలు. ఎటొచ్చి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక పక్రియలో రెండు పేర్లు చివరి నిమిషంలో రేసులోకి వచ్చి ముందుకు దూసుకెళ్లాయి. గుంటూరు జిల్లా లోకల్‌ కోటాలో ఒక స్థానం సీనియర్‌ నేత, కాపు సామాజికవర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మరోసారి అవకాశం ఇచ్చింది పార్టీ. ఇంకో స్థానంలో చాలాకాలం నుంచి ఇంటా, బయట నానుతున్న పేరు మర్రి రాజశేఖర్‌. గతంలో బహిరంగంగా జగన్‌ హావిూ కూడా ఇచ్చారు. షార్ట్‌ లిస్ట్‌లో పేరు ఉండటంతో పార్టీలోని క్లోజ్‌ సర్కిల్స్‌ మర్రికి ఈసారి పదవి ఖాయం అనుకున్నాయి. అయితే నూహ్యంగా  మురుగుడు హనుమంతరావు పేరు చేరింది. హనుమంతరావు 1999, 2004లో మంగళగిరి ఎమ్మెల్యే. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రి. 2014లో టీడీపీలో చేరిన ఆయన ఈ మధ్యనే సైకిల్‌కు గుడ్‌బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ మంగళగిరిలో పర్యటిస్తున్నప్పుడే ఈ ప్రాంత చేనేత వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తానన్న హావిూని వైసీపీ అధినేత ఈ రకంగా పూర్తి చేశారు. ఈ లెక్కతో మర్రి పేరు మరోసారి మిస్‌ అయింది. ఈ జాబితాలో చివరి నిమిషంలో తెరవిూదకు వచ్చిన మరో వ్యక్తి మొండితోక అరుణ్‌కుమార్‌. రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పదవి పొంది పట్టుమని 3 నెలలు తిరక్కుండానే శాసనమండలి ఛాన్స్‌ కొట్టేశారు. కృష్ణా జిల్లా నుంచి ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలనుకున్న హైకమాండ్‌కు ఎమ్మెల్సీ స్థాయికి సరిపోయేంత మరో అభ్యర్థి కనిపించకపోవడంతో అరుణ్‌నే ఎంపిక చేశారు. ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం మర్రి రాజశేఖర్‌ ఎమ్మెల్సీ అవుతారని భావించారు.  ఆ తర్వాత మంత్రిని చేయడం కోసం  కేబినెట్‌ ప్రక్షాళన జరుగుతుందని అనుకుంటే.. ఆయన సంగతేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే అధినేత దృష్టిలో ఉన్న వారికి ఆలస్యంగానైనా అవకాశం వస్తుందని చెబుతున్నారు ముఖ్య నాయకులు. పదవి ఆశించి భంగపడిన వారు ప్రస్తుతానికి అసంతృప్తితో గుంభనంగా ఉన్నారు.