ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీల కసరత్తు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 29: జిల్లాలో ఎమ్మెల్సీల ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుండటంతో పోటీ చేసేందుకు ఆయా పార్టీలకు చెందిన నాయకులు సిద్ధమవుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టిఆర్‌ఎస్‌, టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే విధంగా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఐకాస తమ అభ్యర్థిని నిలిపేందుకు తీర్మానించడంతో ప్రాధాన్యత  సంతరించుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్‌ నియోజకవర్గ పట్టభద్ర, ఉపాధ్యాయ స్థానల పరిధిలోకి  ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలు వస్తాయి. ప్రస్తుతం పట్టభద్రుల స్థానం నుంచి టిఆర్‌ఎస్‌కు చెందిన లక్ష్మణరావు, ఉపాధ్యాయ స్థానం నుంచి మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వీరి పదవీకాలం 2013 మార్చి 29న ముగుస్తుండడంతో ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల కోసం పలు ఉపాధ్యాయ సంఘాలతో పాటు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోటీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిచుకుంటున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇటీవల సత్యనారాయణ జిల్లాలో విస్తృతంగా పర్యటించి మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి రిటైర్డ్‌ ఎంఈవోతో పాటు మరికొంత మంది ఉపాధ్యాయులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ఉద్యమం కారణంగా టిఆర్‌ఎస్‌, బలపడడంతో ఈ పార్టీ మద్దతు కూడగట్టుకునేందుకు పలువురు కేసిఆర్‌తో పాటు ఇతర  నాయకులను కలుసుకొని మద్దతు కోరుతున్నారు. ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు తమ తమ అభ్యర్థులను నిలిపేందుకు నిర్ణయించాయి. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపడంతో పోటీ తీవ్రంగా పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలతో జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది.