ఎయిమ్స్‌ కోసం గట్టిగా కృషిచేశాం

కల నెరవేరిందన్న ఎంపి బూర నర్సయ్య గౌడ్‌

న్యూఢిల్లీ,జూలై31(జ‌నం సాక్షి): ఎయిమ్స్‌ కోసం చేసిన ఒత్తిడి ఫలించిందని, దీనిపై ప్రకటన రావడం వల్ల తెలంగాణ ప్రయత్నం ఫలించిందని భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్‌ తెలిపారు. ఈ ఏడాది కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని ఆశాభావంతో ఉన్నాం. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్లక్ష్యం వల్లే బీబీనగర్‌ నిమ్స్‌లో వైద్య సేవల్లో జాప్యం జరిగింది. వారే ఇప్పుడు ఆందోళనకు దిగడం శోచనీయన్నారు. అయితే గతంలో అనుకున్నట్లుగా బీబీనగర్‌ నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్పు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. రెండేళ్ల క్రితం అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలంగాణకు ఎయిమ్స్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం భూమికి సంబంధించి ప్రతిపాదనలు పంపాలని కోరగా రెండేళ్ల క్రితమే పంపారు. నిధుల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. ఎయిమ్స్‌ మంజూరు అయ్యే సూచనలు కనిపించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నిమ్స్‌ భవనంలో ఓపీ సేవలు ప్రారంభించింది. ఎప్పటికైనా ఎయిమ్స్‌ ప్రకటిస్తారనే ఆశలు ఉన్నాయని భావించామని, అదే నిజమయ్యిందని ఎంపి బూర నర్సయ్య గౌడ్‌ తెలిపారు. నిధుల కేటాయింపు కోసం బూర నర్సయ్యగౌడ్‌ ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రులకు లేఖ రాశారు.