ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించండి
సీఎం ఆదేశం
హైదరాబాద్, జూన్ 25 (జనంసాక్షి):
ఎరువులు, విత్తనాల పంపిణీని సక్రమంగా నిర్వహించాలని, రైతులకు త్వరితగతిన అందించాలని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం నుంచి సోమవారంనాడు ఆయన జిల్లా కలెక్టర్లతోను, ఉన్నతాధికారులు, అధికారులతోను వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రైతు సమస్యలు, ఖరీఫ్ లక్ష్యాలపై దిశా నిర్దేశం చేశారు. ఎరువులు, ఖరీఫ్ విత్తనాలు అంశంపై వారికి ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎరువులు, విత్తనాల పంపిణీని నిరంతరం పర్యవేక్షించాలని, ఆ వివరాలను రెండు రోజులకొకమారు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి వెల్లడించాలని సూచించారు. ఉపాధి పథకం కింద ఇవ్వాల్సిన సొమ్మును వెంటనే కూలీలకు అందించాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యా పక్షోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. జులై 15వ తేదీ లోపు విద్యార్థులకు యూనిఫారాలు, పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో ప్రతిరోజు 7 గంటల పాటు విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించి డ్రాపవుట్‌లను తగ్గించాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్సులో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, బాలరాజు, గీతారెడ్డి, డికె అరుణ, తదితరులు పాల్గొన్నారు.