ఎలాంటి పరిణామానికైనా సిద్ధంకండి

– సభాసాక్షిగా విభజన హావిూలపై కేంద్రాన్ని నిలదీయండి
– పోరాడాల్సిన సమయంలో వైసీపీ తప్పుకుంది
– వైసీపీ పలాయన వాదానికి ఇదే నిదర్శనం
– ప్రత్యర్థుల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి
– సభనుంచి సస్పెండ్‌ చేసినా వెనుకంజ వేయవద్దు
– టెలీ కాన్ఫరెన్స్‌లో ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
న్యూఢిల్లీ, జులై18(జ‌నం సాక్షి) : ప్రత్యేక ¬దాపై పార్లమెంట్‌లో చర్చకు వచ్చేలా వ్యూహాత్మంగా ముందుకు సాగాలని, ఏ పరిణామానికైనా ఎంపీలు సిద్ధంగా ఉండాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. బుధవారం ఉదయం ఎంపీలతో  చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. అఖిలపక్షం భేటీల చర్చ సారాంశాన్ని ఎంపీలు వివరించగా, ఉండవల్లితో చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి వివరించారు. జరిగిన అన్యాయాన్ని ఎందుకు చక్కదిద్దలేదని ప్రధాని మోదీని నిలదీయాలని ఎంపీలకు
సూచించారు. పార్టీల నేతలను కలిసి అవిశ్వాస తీర్మానానికి మద్దతు కోరినందుకు ఎంపీలను చంద్రబాబు అభినందించారు. ఇదే స్ఫూర్తి పార్లమెంటు సమావేశాల్లో చూపాలన్నారు. ఎప్పటికప్పుడు ఢిల్లీ పరిణామాలను గమనిస్తుంటానని, ఒక లక్ష్యం కోసం మనం పోరాటం చేస్తున్నామని, భావితరాల భవిష్యత్‌ కోసం పోరాడుతున్నామని, ఏ పరిణామానికైనా సిద్ధంగా ఉండి పోరాటం చేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. యావత్‌ రాష్ట్రం మొత్తం ఢిల్లీవైపే చూస్తోందని, పార్లమెంటు పైనే 5కోట్ల ప్రజల దృష్టివుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని పోరాటం చేయాలని, విభజన చట్టంలో అంశాల అమలుకు ఒత్తిడి చేయాలని అన్నారు. ప్రధాని హావిూలు ఎందుకు అమలు చేయరని సభా సాక్షిగా నిలదీయాలని ఆదేశించారు. పోరాటం తమకు కొత్తేవిూ కాదని, అన్యాయాన్ని చక్కదిద్దుతామని ఆనాడు బీజేపీ చెప్పిందని, ఇప్పుడు బీజేపీ నేతలే అన్యాయం చేస్తున్నారన్నారు. ఇది నమ్మిన వారిని మోసగించడం కాదా అని అన్నారు. ప్రజాకోర్టులో దోషులుగా నిలబెట్టాలన్నారు. ఏఏ పార్టీలు టీడీపీకి మద్దతు ఇస్తాయో ప్రజలే చూస్తారని, పోరాటం సమయంలో వైసీపీ ఎంపీలు గోద వదిలేశారని, బయటకు వచ్చి పోరాడుతున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. వైసీపీ పాలాయనవాదానికి ఇదే నిదర్శనమన్నారు. వాళ్ల రాజీనామాలను ప్రజలు పట్టించుకోవడం లేదని, వైసీపీకి వాయిస్‌ లేకుండా పోయిందని, దిక్కుతోచని స్థితిలో పడిందన్నారు. ‘వాళ్ల విశ్వసనీయత పోయిందని…మన విశ్వసనీయత దెబ్బతీయాలని చూస్తున్నారు, ప్రత్యర్థుల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. సున్నా నుంచి నాలుగేళ్లలో ఈ స్థాయికి వచ్చామని, వ్యవసాయం అనుబంధ రంగాలలో ముందున్నామని ఎంపీలతో చంద్రబాబు అన్నారు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించామన్నారు. ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నా కేంద్రం సహకరించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. చట్టంలోని అంశాలు, హావిూలు నెరవేర్చకపోవడం రాజకీయ పార్టీలపై ప్రజల్లో విశ్వాసం కోల్పేయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం వచ్చిందన్నారు. ఎంపీలు సమన్వయంతో పనిచేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. లాలూచీ రాజకీయాలను ఎండగట్టాలన్నారు. కావాల్సిన సమాచారం ఇవ్వడానికి అధికార యంత్రాంగం సిద్దంగా ఉందని, ఎంపీలు దానిని సమర్ధంగా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.