ఎల్బీ స్టేడియం ఎదుట టీ అడ్వకేట్ జేఏసీ నిరసన, అరెస్టు
అవినీతి మంత్రులను కాపాడి
ఉద్యమకారుల అరెస్టుకు అనుమతిస్తారా
టీ న్యాయవాదుల జేఏసీ ఫైర్
హైదరాబాద్, డిసెంబర్ 16 (జనంసాక్షి) :
హైకోర్టులో తెలంగాణ ప్రాంతం వారికి 42 శాతం రిజర్వేషనర్ కల్పించాలంటూ ఉద్యమించిన వారిని ప్రాసిక్యూషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమ తించడాన్ని నిరసిస్తూ తెలంగాణ లాయర్ల జేఏసీ నాయకులు ఆదివారం లాల్ బహదూర్ స్టేడియం ఎదుట ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ మేధోమథనానికి హాజరవుతున్న నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను దగ్ధం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన వాటాపై ఉద్యమిస్తే అక్రమంగా ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర పాలకుల దుర్నీతిని ఎండగట్టారు. తెలంగాణ ప్రాంతానికి హైకోర్టులో చట్టబద్ధంగా దక్కాల్సిన వాటాను సీమాంధ్రులు ఎత్తుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లాయర్ల ఆందోళన ఉగ్రరూపం దాల్చడంతో పోలీసులు లాయర్లను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.