ఎవరి క్రేజ్‌ వారికానందం అన్నట్లు.. సెల్ఫీ.. విత్‌ హైజాకర్‌

88

లండన్‌: ఎవరి క్రేజ్‌ వారికానందం అన్నట్లు.. ఒకరేమో మాజీ ప్రియురాలను కలిసేందుకు ఏకంగా విమానాన్ని హైజాక్‌ చేసి వార్తల్లోకెక్కాడు. అయితే అతగాడి పాపురాలిటీని మెచ్చాడేమో తెలియదు గానీ.. మరొకరేమో.. ఏకంగా ఆ హైజాకర్‌తో కలిసి సెల్ఫీ తీసుకొని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. మరి ఈ సెల్ఫీ విత్‌ హైజాకర్‌ కథేంటో మీరే చదవండి..

మాజీ ప్రియురాలిని చూసేందుకు ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం ఓ విమానాన్ని హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో బందీగా ఉన్న బ్రిటన్‌కు చెందిన ప్రయాణికుడు.. తన సెల్ఫీ క్రేజ్‌ను బయటపెట్టాడు. ఓ పక్క హైజాకర్‌ను చూసి అందరూ భయపడుతుంటే.. బెంజిమిన్‌ ఇన్స్‌ అనే యువకుడు మాత్రం హైజాకర్‌ దగ్గరకు వెళ్లాడు. నడుముకు బాంబులు చుట్టుకున్న హైజాకర్‌తో కలిసి సెల్ఫీ తీసుకుని.. దాన్ని ట్విట్టర్‌ ద్వారా స్నేహితులకు పంపాడు. ఇంకేముంది కొద్ది సేపటికే ఈ ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్‌ అయ్యింది. పైగా.. ఆ ఫొటోలో బెంజిమిన్‌ నవ్వుతూ కన్పించడంతో.. అతడి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అంటున్నారు నెటిజెన్లు. కొందరు మాత్రం నేరస్థులతో ఫొటోలేంటంటూ పెదవి విరుస్తున్నారు.

56 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళ్తున్న ఈజిప్టు ఎయిర్‌ ఎంఎస్‌ 181 అనే విమానాన్ని సైఫ్‌ ఎల్‌ డిన్‌ ముస్తాఫా అనే వ్యక్తి హైజాక్‌ చేసి.. సైప్రస్‌లోని లర్నాకాలో అత్యవసరంగా దింపేశాడు. దాదాపు 10 గంటల పాటు ఉత్కంఠ రేపిన హైజాక్‌ ఘటన హైజాకర్‌ అరెస్టుతో సుఖాంతమైంది. ప్రస్తుతం ముస్తాఫాను సైప్రస్‌ పోలీసులు విచారిస్తున్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేనందువల్లే ఈ పని చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.