ఎవరి లెక్కలు వారివే..
ఆదిలాబాద్, డిసెంబర్ 2 : ఆర్టీసీ సంస్థలో ఈ నెల 22న జరగునున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో స్టాప్ అండ్ వర్క్స్ యునియన్ ఇప్లాయిస్ యునియన్లు కలిసి పోటీ చేసినప్పటికీ గుర్తింపు కార్మిక సంఘంగా నేషనల్ మజ్దూర్ యునియన్ విజయం సాధించింది. తెలంగాణ ఉద్యమ కారణంగా ఎన్‌ఎంయు నుండి పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రాంతం నుండి కార్మికులు విడిపోయి తెలంగాణ మజ్దూర్ యునియన్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో కార్మిక సంఘాలు ఎలాంటి పొత్తు లేకుండా ఎవరికి వారే పోటీ చేస్తుండడంతో ఈ ఎన్నికలు అసవత్తరంగా, సవాలుగా మారాయి. ఇటీవల సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించడంతో దాని ప్రభావం ఆర్టీసీ ఎన్నికల్లో పడనున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మజ్దూర్ యునియన్ బలపడడమే కాకుండా చైతన్య యాత్ర ప్రారంభించి ఈ ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని బలంగా వినిపించేందుకు తెలంగాణ మజ్దూర్ యునియన్ పలు కార్యక్రమాలను చేపట్టింది. తెలంగాణ ఉద్యమ కారణంగా ఆర్టీసీ ఎన్నికల్లో మిగితా కార్మిక సంఘాలలో ఆందోళన ప్రారంభమైంది.