ఎవోబిలో జల్లెడ పడుతున్న పోలీసులు
మావోల హత్యల తరవాత తీవ్రమైన వేట
ఆందోళనలో గిరిజన పల్లెలు
అప్రమత్తంగా ఉండాలని నేతలకు హెచ్చరిక
విశాఖపట్నం,సెప్టెంబర్26(జనంసాక్షి): ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ ఎమ్మెల్యేను మావోలు హత్య చేశాక ఇప్పుడు ఇరు రాష్ట్రాల పోలీసులు కూంబింగ్ చేపట్టారు. అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్‌తో గిరిజన ప్రాంతాలను జ్లలెడపడుతున్నారు. ఓ వైపు పోలీసుల గాలింపు, మరోవైపు మావోయిస్టుల వారోత్సవాలతో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరగుతుందోనన్న భయంతో
గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య అనంతరం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కిడారి హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గిరిజనులను విచారిస్తున్నారు. ప్రత్యక బృందం అధికారి ఫకీరప్ప నేతృత్వంలో స్థానికులను విచారిస్తూ.. ఏజెన్సీలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కిడారి డ్రైవర్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. డీజీపీ ఠాకుర్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించి.. దర్యాప్తుపై వివరాలు సేకరించనున్నారు. కిడారి హత్య అనంతరం మావోయిస్టులు ఎటు వైపుకు వెళ్లారు.. హత్యలో స్థానికుల ప్రేమేయం ఎమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. హత్యలో ఇప్పటికే పలువురు మావోయిస్టులను అనుమానితులుగా గుర్తించిన పోలీసులు వారి జాడ కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు విశాఖ నగర ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా సూచించారు. సాధారణంగా చాలా మంది నగర ప్రజాప్రతినిధులు మావోయిస్టు సమస్య అంటే అదేదో రూరల్ ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంగా భావిస్తుంటారని, ఆ భావన తప్పని గుర్తుంచుకోవాలన్నారు. గతంలో జరిగిన ఘటనలను ఉదంతాలనుగానీ పరిశీలిస్తే మావోయిస్టుల తీవ్రత తెలుస్తుందన్నారు. మావోయిస్టుల ప్రభావం ఏవిూ లేదని అందరూ భావించే చోటే మావోయిస్టులు దాడులకు పాల్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖ నగర పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పోలీసు రక్షణ పొందుతున్న వారి భద్రత ఏర్పాట్లను సవిూక్షిస్తున్నామని తెలిపారు. పోలీసు భద్రత పొందుతున్న వారు వారికి పోలీసులు పాటించాలని చెప్పిన విషయాలను తప్పకుండా పాటిస్తే చాలా వరకు ముప్పులను తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ముప్పున్నవారు ఇతర జిల్లాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే సంబంధిత జిల్లాల పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి రక్షణ కల్పిస్తామన్నారు. కొందరికి బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు కేటాయించారని, కానీ వారు ఆయా వాహనాలు అనుకూలంగా లేవని సాధారణ వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారన్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనాలను వాడడం లేదన్న సమాచారం ఉందన్నారు. ముప్పు లేదని నిర్లక్ష్యం ప్రదర్శిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మావోయిస్టు యాక్షన్ టీం దాడులకు అవకాశాలు కూడా ఉంటాయన్నారు.