ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌తోపాటు..
విద్యుత్ అవసరాలకు కొత్త డిస్కంల ఏర్పాటు
` ` విద్యుత్‌శాఖ పై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్(జనంసాక్షి):విద్యుత్‌శాఖ పై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎస్‌పీడీఎస్, ఎన్‌పీడీసీఎల్‌లతో పాటు మరో కొత్త డిస్కం ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించామని తెలిపారు. దీనికి సంబంధించి ప్రాథమిక ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు. వ్యవసాయం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా , జీహెచ్‌ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనపై చర్చించారు. డిస్కంల పునర్ విభజన తర్వాత పీపీఏ అలొకేషన్, సిబ్బంది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశాను. కేబినెట్ ఆమోదం అనంతరం కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
2.గ్రేటర్ హైదరాబాద్‌లో అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్‌కు ప్రతిపాదన
` డిసెంబరులోగా ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలి
` విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్(జనంసాక్షి):గ్రేటర్ హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు వివరిచారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్ డీపీఆర్ తయారీకి సంబంధించి పలు అంశాలను ఈ సందర్భంగావారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ కేబులింగ్ తో పాటు ముందుగా కోర్ అర్బన్ రీజియన్ లో విద్యుత్ సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని అధికారులకు సూచించారు. ఓవర్ లోడ్ సమస్య తలెత్తకుండా లోడ్ రీప్లేస్మెంట్ చర్యలు చేపట్టాలని, సబ్ స్టేషన్ కెపాసిటీ కంటే ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైనచోట సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని,కోర్ అర్బన్ రీజియన్ లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల అవసరం ఉందో గుర్తించాలని అధికారులను ఆదేశించారు.అర్బన్ ఏరియాలలో విద్యుత్ సబ్ స్టేషన్ లలో అధునాతన సాంకేతికను ఉపయోగించాలని, విద్యుత్ కేబుల్స్ తో పాటు ఇతర కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, బెంగుళూరుతో పాటు ఇతర రాష్ట్రాలలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్ట్ లను అధ్యయనం చేయాలని, డిసెంబరులోగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ కు ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.వచ్చే రెండున్నరేళ్లలో కోర్ అర్బన్ రీజియన్ లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి
` నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
` పలువురు ఐఎఎస్‌ల బదిలీలు
హైదరాబాద్(జనంసాక్షి) తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా ఎన్వీఎస్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఎన్వీఎస్ రెడ్డిని హెచ్‌ఎంఆర్‌ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం.. మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా శృతి ఓజా, ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, హెచ్‌ఎండీఏ కార్యదర్శిగా కోట శ్రీవాత్సవకు అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా ఎం.రాజారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా రాజేశ్వర్ నియమితులయ్యారు.
వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో చర్చలు సానుకూలం
` ఆ దేశ ప్రతినిధితో సమావేశం అనంతరం ప్రకటించిన వాణిజ్య మంత్రిత్వ శాఖ
న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సానుకూలంగా జరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. త్వరితగతిన పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని పేర్కొంది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదలు చేసింది.‘పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు వేగవంతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అమెరికా ప్రధాన చర్చాకర్త బ్రెండన్ లించ్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా, భవిష్యత్తు దృక్పథంతో ఉన్నాయి’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఈ వాణిజ్య చర్చల కోసం సోమవారం రాత్రి అమెరికా ప్రతినిధి బ్రెండెన్ లించ్ భారత్‌కు వచ్చారు. మన తరఫున వాణిజ్యశాఖకు చెందిన సీనియర్ అధికారి రాజేశ్ అగర్వాల్ ప్రాతినిధ్యం వహించారు.