– ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు
వివరాలు వెల్లడించిన ఎస్పీ వినీత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఆగస్టు 24 (జనం సాక్షి) : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు దళ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ ఎదుట లొంగిపోయారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సీపీఐ మావోయిస్టు పార్టీ చత్తీస్గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, యాంపేర్ గ్రామానికి చెందిన ఏకో దేవా అలియాస్ సంపత్ (25), అదే జిల్లా తుమ్రల్ గ్రామానికి చెందిన మడివి పొజ్జా (23) అనే ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయినట్లు తెలిపారు. ఏకో దేవా అలియాస్ సందీప్ 2015 వ సంవత్సరంలో అప్పటి పామేడ్ లాస్ కమాండర్ కమల ప్రోద్భలంతో పామేడ్ లాస్ సభ్యుడిగా చేరి ఆరు నెలలు పనిచేసిన తర్వాత దండకారణ్యం పశ్చిమ బస్తర్ డివిజన్ లో 2వ కంపెనీ దళ సభ్యునిగా బదిలీ అయ్యాడని, అనంతరం 2021 సంవత్సరంలో దళ సభ్యుడు నుండి ఏసిఎం (సెక్షన్ కమాండర్) గా అదే దళంలో పనిచేశాడని అన్నారు. ఇతడు ఎస్ ఎల్ ఆర్ ఆయుధాన్ని కలిగియుండి, పశ్చిమ బస్తర్ డివిజన్లోని మద్దేడు, నేషనల్ పార్క్, గంగుళూరు, బైరాంఘడ్ ఏరియాలో అనేక మావోయిస్టు కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడని, 2016లో ఉడతమళ్ల,2020 ఎర్రపల్లి, 2020 అక్టోబర్ లో జరిగిన తోడ్కు, 2021 కేంద్రంలో జరిగిన కాల్పుల ఘటనల్లో ఇతనికి ప్రమేయం వుందన్నారు. లొంగిపోయిన వారిలో రెండవ అతనైన
మడివి పొజ్జా 2019వ సంవత్సరంలో కోమటిపల్లి ఆర్ పి సి మిలీషియా కమాండర్ అయిన మంగుడు ప్రోద్భలంతో మిలీషియా సభ్యునిగా ఇప్పటివరకు పని చేస్తున్న ఇతను 12 బోర్ ఆయుధాన్ని కలిగియుండి, దండకారుణ్య దక్షిణ బస్తర్ డివిజన్లోని పామేడ్, ఉసూర్, గుడ, తత్తం పోలీస్ స్టేషన్ల పరిధిలో మిగతా దళాలతో కలిసి విధ్వంసకర సంఘటనలలో పాల్గొన్నాడని పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో బాసగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలంపల్లి వద్ద సి ఆర్పి ఎఫ్ పోలీసుల పైన దాడి ఘటన, అదే సంవత్సరం కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఆర్పిఎఫ్ క్యాంపుపై దాడిలో మాడివి పొజ్జా పాల్గొన్నాడని తెలిపారు. అయితే మావోయిస్టు పార్టీ నాయకత్వం వేధింపుల కారణంగా వారిద్దరు తమ ప్రాణాలకు ముప్పు ఉందని భయ పడ్డారని అన్నారు. చాలామంది మావోయిస్టు పార్టీ సభ్యులు మావోయిస్టు పార్టీని విడిచి వెళ్లారని, పార్టీ నుంచి వెళ్లడానికి కూడా ఇష్టపడుతున్నారని అయితే మావోయిస్టు పార్టీ నా యకులు వారిని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పార్టీని వదిలి బయటికి వెళితే పోలీసు వారిని చంపేస్తారని భయాందోళనకు గురి చేస్తున్నారని తెలిపారు. అయితే మావోయిస్టు పార్టీ సభ్యులెవ్వరూ ఆలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, పార్టీ ని వీడినవారందరికీ పోలీసులు అన్నివేళలా అండగా ఉంటారని సూచించారు. ఇప్పటికైనా మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న సభ్యులంతా ప్రభుత్వం ముందు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల ప్రతి ఫలాలను అందేలా పోలీ్‌సశాఖ బాధ్యత తీసుకుంటుందన్నారు.
మావోయిస్టు పార్టీ కాలం చెల్లిన సిద్ధాంతాలకు విసిగిపోయి, ఆదివాసి ప్రజల అభివృద్ధికి మావోయిస్టు పార్టీ అడ్డంకిగా మారుతుందని, అభివృద్ధి నిరోధక మావోయిస్టు పార్టీలో కొనసాగుతూ తమ ఆదివాసి జాతికి, ప్రాంతానికి సరైన విద్య, వైద్యం,ఆరోగ్యం, రవాణా వంటి సదుపాయాలను దూరం చేసుకుంటూ అతి కష్టంగా ఇప్పటి వరకు జీవనం సాగిస్తున్నారని ఇకపై అలాంటి వాటికి స్వస్తి పలికి జనజీవన స్రవంతిలో కలవాలని అన్నారు. పార్టీని వీడాలనుకొనే వారు దగ్గరలోని పోలీసు స్టేషన్ కు గాని,బంధుమిత్రుల ద్వారా గాని, నేరుగా ఎస్పి వద్దకు వచ్చి సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో ఏఎస్పీ రోహిత్ రాజు, 141 బేసిన్ సిఆర్పిఎఫ్ క్యాంప్ అధికారి, తదితరులు పాల్గొన్నారు