ఎస్సీ, ఎస్టీలపై దాడులపై కఠిన చర్యలేవీ?
ఎంతకాలం మభ్యపెట్టే చర్యలతో గడుపుతారు
పాలకుల విధానాలతో ఆయా వర్గాల్లో ఆందోళన
అమరావతి,ఆగస్ట్14(జనం సాక్షి): గుజరాత్‌లో మతోన్మాద ఘర్షణల తర్వాత మోడీని నిలదీసిన మొదటి రాజకీయ నేతను తానేనని చంద్రబాబు తరచూ అంటున్నారు. ఇటీవల ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చాక ఈ విమర్శలకు పదను పెట్టారు. మోడీది మతవాదమని, ఆయనను నిలదీసిన ధీరుడిని తానేనని అంటున్నారు. అయితే టిడిపి అధినేత చంద్రబాబు నేతృత్వ పాలనలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై కొనసాగుతున్న దాడులు తక్కువేవిూ కాదు. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులోనూ, రాజధాని అమరావతికి చెంతనే ఉన్న గుంటూరు జిల్లా గొట్టిపాడులోనూ దళితులపై జరిగిన దాడులపై నేటికీ కనీస చర్యలు తీసుకోలేదు. దళితులవిషయంలో టిడిపి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల నెల్లూరు జిల్లా రాపూరులో దళితవాడలపై పోలీసుల దౌర్జన్యాన్ని చూసీచూడనట్టు వదిలేసారు. తాజాగా తిరుపతి రుయా ఆసుపత్రిలో దళిత వైద్యురాలు శిల్ప ఆత్మహత్య విషయంలోనూ దోషులపై చర్యలు తీసుకోలేదు. ఆమె వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న తీరు దారుణం. ఇలా దళితులపైనా, గిరిజనులపైనా దాడులను ఉపేక్షిస్తూనే రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ప్రలోభ పెట్టేందుకు అధికార టిడిపి, రాష్ట్రంలోని ప్రతిపక్ష వైసిపి పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటుపరం చేస్తూ ఒకవైపు ఉన్న ఉపాధి భద్రతను విచ్ఛిన్నం చేస్తున్న పాలకులు నిరుద్యోగాన్‌ఇన పెంచేస్తున్నారు. దళిత, గిరిజనుల పరిస్థితులను మెరుగుపరచాలని ఏ ప్రభుత్వమైనా తీవ్రంగా ప్రయత్నించదలిస్తే చేయాల్సింది అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాదు.
సమానత్వాన్ని కల్పించే రాజ్యాంగ, న్యాయపరమైన హక్కులను సమర్థవంతంగా అమలు చేసేందుకు హావిూ ఇవ్వాలి. అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి వారికి భూహక్కులు బదలాయించాలి. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని రాజ్యాంగ తొమ్మిదో షెడ్యూలులో చేర్చి రక్షణ కల్పించాలి. దళితులు, గిరిజనుల జీవనోపాధిపై, హక్కులపై, ఐక్యతపై, రాజ్యాంగ హక్కులపై పాలక పక్షాలు సాగిస్తున్న దాడి శ్రామిక ప్రజల ముందున్న అత్యంత తీవ్రమైన సవాలు. దళితులకు, గిరిజనులకు కాస్తోకూస్తో రక్షణ కల్పిస్తున్న ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు సాగుతున్న కుట్రలకు అడ్డుకట్ట వేయాలి. అటవీ సంపదపై వారికున్న హక్కులు హరించివేయబడుతున్నాయి. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ సర్వం ప్రయివేటుకు సమర్పించే విధానాల వల్ల రిజర్వేషన్లు ఉన్నా కూడా ఉపాధి పొందలేని దుస్థితిలో విలవిల్లాడుతున్నారు. సహజసిద్ధంగానూ, రాజ్యాంగబద్ధంగానూ లభించిన హక్కులు హరించుకుని పోయే దుస్థితులు దాపురించాయి. దాడులు నిత్యం కృత్యమై దళితులు, గిరిజనుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోందన్న ఆందోళనలు పెరిగాయి. ప్రతిరోజు మహిళలు దేశంలో ఎక్కడో ఒక చోట అత్యాచారానికి గురౌతున్నారు.