ఏజెన్సీలో విజృంభిస్తున్న డెంగ్యూ

వ్యాధి సోకి మరో మహిళ మృతి

కాకినాడ,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): తూర్పు గోదావరి జిల్లా మన్యంలో మరోసారి డెంగ్యూ పడగవిప్పింది. ఇటీవలే ఒక నిండు గర్భవతి డెంగ్యూకి బలైన ఘటన మరువకముందే మరో మహిళ డెంగ్యూకి బలైన ఘటన చోటుచేసుకుంది. మండలంలోని రేఖపల్లి గ్రామంలో కుంజా అక్కమ్మ (40) అనే మహిళ డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున భద్రాచలం ఆస్పత్రిలో మృతి చెందింది. వివరాల్లోకెళితే.. గత నాలుగు రోజులుగా జ్వరం వస్తుండటంతో కుటుంబ సభ్యులు అక్కమ్మను రేఖపల్లి పిహెచ్‌సికి తరలించారు. పిహెచ్‌సిలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడినట్లు సమాచారం. ఎన్‌ఎస్‌1 పాజిటివ్‌ డెంగ్యూ గా గుర్తించిన రేఖపల్లి వైద్యాధికారులు మెరుగైన చికిత్స కోసం ఆమెను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపి, వైద్యం అందించేందుకు నిరాకరించారు. విషయం తెలుసుకున్న భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య ఏరియా ఆసుపత్రికి చేరుకొని ఆమెకు చికిత్స అందించాలని వైద్యులను కోరారు. డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తుండగానే అక్కమ్మ మరణించింది.

తాజావార్తలు