ఏడుగంటలు కరెంటు ఇవ్వాలి

బేషరుతుగా తెరాసా ఎమ్మల్యేలను విడుదల చేయాలి : కోదండరాం
బొల్లారంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే నిరసన
హైద్రాబాద్‌: ఏడు గంటల పాటు విద్యుత్‌ ఇవ్వాలని, అరెస్ట్‌ చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. మంగళవారం తెలంగాణలో విద్యుత్‌కోతలకు నిరసనగా ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద దీక్ష చేస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేయడం అసమంజసమన్న ఆయన వారిని భేషరతుగా విడుదల చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేసిన బొల్లారం పీఎస్‌ వద్దకు చేరుకున్న ఆయన అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ఏడు గంటల పాటు విద్యుత్‌ ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఆయన మద్దతు పలికారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఆయన వంటావార్పు నిర్వహించారు. తెలంగాణపై చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం తెలంగాణ రైతులకు తీరని నష్టాన్ని కల్గిస్తున్నార న్నారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో అతలాకుతలమవుతున్న అన్నదాతను కరెంట్‌ కోతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం స్పందించి తెలంగాణలో రైతులకుకరెంట్‌ కోతల నుండి మినహాయింపునిస్తూ, ఏడుగంటలపాటు నిరంతర విద్యుత్‌ అందివ్వాలని, అరెస్ట్‌ చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను భేషరతుగా విడదల చేయాలన్నారు. వంటావార్పు అనంతరం ఆయన ఎమ్మెల్యేలతో కలిసి అక్కడే నిద్రించారు.