ఏపీని హరితాంధప్రదేశ్‌గా మర్చుదాం


– ‘మియావాకి’ పద్ధతిలో మొక్కలు నాటండి
– ప్రతీయేటా 5లక్షల మొక్కలు నాటాలి
– అధికారులకు మంత్రి లోకేశ్‌ దిశానిర్దేశం
అమరావతి, నవంబర్‌26(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ను హరితాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఏపీ మంత్రి నారాలోకేశ్‌ అధికారులకు సూచించారు. సోమవారం అమరావతిలో పంచాయితీరాజ్‌, అటవీశాఖ అధికారులతో మంత్రి లోకేశ్‌ సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ఏపీలో 50శాతం పచ్చదనం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతీయేటా ఐదు లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో 50 లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ప్రముఖ జపాన్‌ పర్యావరణవేత్త అకిరా మియావాకిని లోకేశ్‌ ప్రస్తావించారు. అడవులను వేగంగా పెంచేలా మియావాకి పద్ధతిని అనుసరించాలని లోకేశ్‌ ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో దాదాపు 50 లక్షల ఎకరాల్లో మియావాకి పద్ధతిలో అడువులను పెంచే అవకాశం ఉందని తెలిపారు. ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రతీ మండలంలో ఓ నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామంలో కనీసం 10 ఎకరాల్లో మియావాకి మొక్కలు నాటాలని సూచించారు. రాష్ట్రాన్ని హరితాంధప్రదేశ్‌ గా మార్చేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే ప్రయత్నం దేశంలో ఎక్కడా చేయలేదని లోకేష్‌ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతోనే లక్ష్యాన్ని సాధించగలమని లోకేష్‌ అధికారులకు సూచించారు. మియావాకి పద్ధతిలో మిగతా అడవితో పోల్చుకుంటే మియావాకి అడవి 30 రెట్లు దట్టంగా, 8 రెట్లు వేగంగా పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చటమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, ప్రతీ ఒక్కరూ ఆయన ఆశయాలను అనుగుణంగా ప్రజల్లోకి వెళ్లి అభివృద్ధి పనులను కొనసాగించాలని లోకేశ్‌ సూచించారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్‌ ఉందని, చంద్రబాబు దూర దృష్టితో రాబోయే తరాలకు అన్ని విధాల లబ్ధిపొందుతారని అన్నారు. ఇప్పటి నుంచే ప్రతీ ఒక్కరం కష్టపడి రాబోయే తరాలకు మంచి భవిష్యత్‌ను ఇచ్చే రాష్ట్రంగా ఏపీని తయారు చేసుకోవాలని లోకేశ్‌ అధికారులకు సూచించారు.