ఏపీపై చూపుతున్న వివక్షతను ఎండగట్టంటి

– లోక్‌సభలో ఏపీ వాణి ప్రతిధ్వనించాలి
– ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం
– భాజపా పక్షాన ఎవరున్నారో.. ఎవరు లేరో నేడు తేలిపోతుంది
-ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
అమరావతి, జులై20(జ‌నం సాక్షి) : ఏపీపై కేంద్రం చూపుతున్న వివక్షతను లోక్‌సభ సాక్షిగా ఎండగట్టాలని, ఆధిక్యత ముఖ్యమా..? నైతికత ముఖ్యమా..? అనే చర్చ ప్రజల్లోకి వెళ్లేలా అవిశ్వాసాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఉదయం పార్లీ ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..  కేంద్రం ఆంధప్రదేశ్‌ పట్ల చూపిస్తున్న వివక్షతను పార్లమెంట్‌ వేదికగా ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కొన్ని రాష్ట్రాలకే మేలు చేయడం వివక్షతకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఏపీపై కక్షగట్టి మరీ నష్టం చేయాలని చూస్తున్న వైనాన్ని పార్లమెంట్‌ వేదికగా ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. అవిశ్వాసంపై చర్చసందర్భంగా దేశం మొత్తం సమస్యలను ఇతర పార్టీలు ప్రస్తావిస్తాయని.. ఇతర రాష్ట్రాల ప్రజల దృష్టి వారి సమస్యలపైనే ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కానీ మన ప్రజల దృష్టి మొత్తం ఏపీ సమస్యలపైనే ఉంటుందన్న విషయం ప్రతి నేతా గుర్తుంచుకోవాలన్నారు. ఎవరు స్పందించినా, స్పందించక పోయినా తెలుగుదేశం పోరాటం ఆగదని స్పష్టం చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే వైకాపా డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. పోరాటంలో తాము కూడా ఉన్నామని చెప్పుకోవాలని చూస్తోందని.. వైకాపాలో ఆరాటం తప్ప పోరాట స్ఫూర్తి ఏమాత్రం లేదని విమర్శించారు. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా ఢిల్లీకి వెళ్లిన ఎంపీలకు సీఎం అభినందనలు తెలిపారు. వ్యక్తిగత సమస్యల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని రుజువు చేశారని అభినందించారు. అవిశ్వాసంపై చర్చలో రాష్ట్ర సమస్యలపై ధ్వజమెత్తాలని.. అవకాశ వాద రాజకీయాలను ఎండగట్టాలని హితభోదచేశారు.. భాజపాకు ఎవరు సానుకూలమో, ఎవరు ప్రతికూలమో ఇక్కడ తేలిపోతుందన్నారు.. ఐదుకోట్ల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని.. సభసజావుగా జరిగే అవకాశం ఉందా? గలాబా సృష్టిస్తే ఏం చేయాలనే దానిపై ముందస్తు కసరత్తు చేసుకోవాలన్నారు. ఏం జరిగినా…, 5కోట్ల ‘ప్రజలే మనకు ముందు’.. ‘పీపుల్‌ ఫస్ట్‌’ అనేది గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సోమవారం రాజ్యసభలో జరిగే చర్చలో కూడా ఏపీ వాణి ప్రతిధ్వనించాలన్నారు. ప్రధాని ఇచ్చే జవాబును బట్టి తెలుగుదేశం తదుపరి కార్యాచరణ ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు.

తాజావార్తలు