ఏపీ కోసం ప్రతి తెలుగు వ్యక్తి పోరాడుతాడు

– ట్వీట్టర్‌లో మంత్రి లోకేశ్‌
న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : ఎన్డీయే ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో శుక్రవారం చర్చ జరుగుతోంది. తెదేపా పార్టీ తరఫున ఎంపీ గల్లా జయదేవ్‌ అవిశ్వాసంపై ప్రసంగిస్తూ.. ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు. అందుకే పార్లమెంట్‌ వేదికగా ఈ ధర్మపోరాటం చేస్తున్నట్లు చెప్పారు. కాగా.. అవిశ్వాసంపై మంత్రి, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ఏపీకి న్యాయం చేస్తారని భాజపాలో చేరితే.. ఆ పార్టీ మాత్రం తమకు అబద్ధపు హావిూలు ఇస్తూ వచ్చిందని వరుస ట్వీట్లలో ఆరోపించారు. గత ప్రభుత్వాల పాలనలో ఆంధప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని, ప్రధాని మోదీ నాయకత్వంలోని భాజపా అయినా ఏపీకి న్యాయం చేస్తుందన్న నమ్మకంతో 2014లో మేం ఎన్డీయేలో చేరామన్నారు. మాకు న్యాయం చేయాలని అభ్యర్థించామని, చేస్తారని ఇన్ని రోజులు వేచి చూశామని లోకేశ్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30సార్లు ఢిల్లీకి వెళ్లారని మరి వీటి వల్ల మాకేం తిరిగొచ్చింది..? అబద్ధపు హావిూలు, అబద్ధపు వాగ్దానాలు, నకిలీ చిరునవ్వులు. ఇంతకంటే ఏం ఒరగలేదని లోకేశ్‌ అన్నారు. ఇక విూ డ్రామాలు.. టైంపాస్‌ వ్యవహరాలు చాలని, ఏపీ కోసం ప్రతి తెలుగు వ్యక్తి పోరాడుతాడన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేసే యుద్ధంలో ప్రతి ఒక్కరు పాల్గొంటారన్నారు. ఎందుకంటే.. ఏపీకి న్యాయం చేయాలనేదే మా డిమాండ్‌’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.