‘ఐఎస్పై పోరాటం మూడో ప్రపంచ యుద్ధం కాదు’
ప్రపంచ దేశాలకు సవాల్ గా మారిన ఐఎస్ ఉగ్రవాదులు అమెరికా అస్తిత్వాన్ని ఏమీ చేయలేరని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ఐఎస్ పై పోరాటం మూడో ప్రపంచ యుద్ధం కాదని ఆయన చెప్పారు. అమెరిక్ల రక్షణకే తమ మొదటి ప్రాధాన్యమని…ఆ తర్వాతే తమ లక్ష్యం ఉగ్రవాదులని ఆయన తేల్చిచెప్పారు. అమెరికా ముస్లింలను విమర్శించటం, మసీదులను ధ్వంసం చేయటం సరైన చర్య కాదని విధ్వంసానికి పాల్పడుతున్న వారికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఒబామా పదవీకాలం ముగియనుండటంతో చివరిసారిగా ఆయన ఆ దేశ కాంగ్రెస్ లో ప్రసంగించారు. అమెరికాలో ప్రస్తుతం ఒక వ్యక్తి రెండు పర్యాయాల కన్నా ఎక్కువ సార్లు అధ్యక్షుడు ఎన్నికయ్యే అవకాశం లేదు. ఇప్పటికే ఒబామా రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికైనందున చివరిసారిగా ఆయన కాంగ్రెస్ లో ప్రసంగించారు.
అమెరికానే ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశమని.. ఒబామా అన్నారు. దేశం ఎదుర్కొంటోన్న సవాళ్లపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గన్ కల్చర్ నుంచి మన పిల్లలను రక్షించుకుందామని పిలుపునిచ్చారు. అమెరికా పౌరులు భవిష్యత్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విద్య, ఆరోగ్యం, స్వేచ్ఛ, ఆర్థికాభివృద్ధి, భద్రత అంశాలను ఒబామా తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రజలను లక్ష్యంగా చేసుకునే రాజకీయాలను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బున్న వారే రాజకీయాలను శాసిస్తున్న పరిస్థితిని మార్చాల్సిన అవసరముందన్నారు.
మార్పు, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సూచించారు. అమెరికా ప్రజలు మార్పుకు స్వాగతం పలుకుతారన్న ధీమా వ్యక్తం చేశారు. పదవీ నుంచి వైదొలిగిన దేశ భవిష్యత్ పై దృష్టి పెడతా అని ఒబామా చెప్పారు.
అధ్యక్షుడు మాట్లాడుతున్నంత సేపు ఆయన భార్య మిషెల్లీ ఆసక్తిగా విన్నారు. పలుమార్లు ఒబామా స్పీచ్ కు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. ఒబామా చివరి ప్రసంగానికి అమెరికాలోని ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. మైక్రోసాప్ట్ సీఈవో సత్యనాదెళ్ల సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.