ఐటిడిఎ ప్రత్యేక డిఎస్సీకి ప్రభుత్వ ఆదేశాలు
ఆదిలాబాద్, జూలై 13 : ఐటిడిఎ పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక డిఎస్‌సిని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన అభ్యర్థులకు ఈ డిఎస్‌సి ఒకవరం అని చెప్పవచ్చు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష సాధించి డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ప్రత్యేక డీఎస్సీ ప్రకటనతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ గతంలో రెండుసార్లు నిర్వహించిన ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీలో అభ్యర్థులు లేక మిగిలిపోయిన 247 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రత్యేక డీఎస్సీని నిర్వహించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎంపిక కమిటీ ఏర్పాటు చేసి డీఎస్సీని నిర్వహిస్తారు. ప్రత్యేక డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తారు. ఈ నెల 28వ తేదీ వరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించి ఆగస్టు 13న అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. ఈ 247 పోస్టులలో 194 ఎస్‌జిటిలు కాగా మిగిలన 51 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దీంతో గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆశ్రమ పాఠశాలలలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ అయి విద్యార్థులకు న్యాయం కలగనున్నది.