ఐటీ రంగంలో నవశకం
– టీ హబ్‌ను ప్రారంభించిన రతన్ టాటా
హైదరాబాద్,,నవంబర్ 5 (జనంసాక్షి):
తెలంగాణ ఐటిరంగంలో నూతన శకం ఆరంభమయ్యింది. ఐటిలో కొత్త ఆవిష్కరణలకు తెరతీసేలా టి హబ్‌కు మహామహుల మధ్యన ప్రారంభోత్సవం జరిగింది. ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఉన్నతస్థానానికి తీసుకెళ్లేందుకు అంతర్జాతీయస్థాయిలో సిద్ధం అయిన ఇంక్యుబేటర్ సెంటర్ టీ హబ్ ఘనంగా ప్రారంభమయింది. గవర్నర్ నరసింహన్, ఐటీ మంత్రి కేటీ రామారావు, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా చేతుల విూదుగా టీ హబ్ ప్రారంభం జరిగింది. తాను టీ హబ్ బిల్డింగ్‌ను చూసి ఆశ్చర్య పోయానని గవర్నర్ నరసింహన్ అన్నారు. రతన్ టాటా, మంత్రి కేటీఆర్‌తో కలిసి గచ్చిబౌలిలో టీ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. టీ హబ్ రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తుందని తెలిపారు. గ్రావిూణ ప్రాంతాల్లోనూ ఉత్తమ ఆలోచనపరులున్నారని అంటూ, టీ హబ్ సేవలు గ్రావిూణ ప్రాంత ఆలోచనపరులకు చేరేలా చూడాలని
సూచించారు. నూతన ఆలోచనలకు టీ హబ్ ట్రెండ్‌సెట్టర్ అవుతుందని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం కచ్చితంగా నెరవేరుతుందని పేర్కొన్నారు. ఐటీతోపాటు కనీస అవసరాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలని ఆశిస్తున్నానన్నారు. 17 నెలల కాలంలో కెటిఆర్ కృషి చేసి దీనిని సాధించడం హర్షణీయమన్నారు. ఉత్తమ ఆలోచనలకు టీ హబ్ సరియైన వేదిక అని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అన్నారు. నవ భారత నిర్మాణానికి నూతన ఆలోచనలే ఆధారమని తెలిపారు. ఇవాళ గచ్చిబౌలిలో టీ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రతన్ టాటా పాల్గొని టీ హబ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. టీ హబ్ ఇండియాకు కొత్త ముఖ చిత్రమవుతుందని రతన్ టాటా కొనియాడారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో ఆయన ఔత్సాహికులు, ఐటీ ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. భారత్‌లో మేధోసంపత్తికి కొదవ లేదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. యువభారత్ ప్రపంచానికి సవాలు విసురుతుందన్నారు. గూగుల్,ఫేస్‌బుక్ తర్వాత సంచలనం భారత్‌లోనేనని.. అదీ హైదరాబాద్ నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరాన్ని స్టార్టప్‌ల రాజధానిగా తీర్చిదిద్దుతామని మంత్రి పునరుద్ఘాటించారు. స్టార్టప్‌లకు రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతామని అన్నారు. టీ హబ్ దేశంలోని యువతకు ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. త్వరలోనే టీ హబ్-2ను కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. టీ హబ్ ఇతర ఇంక్యుబేటర్ల భాగస్వామ్యంతో పనిచేస్తుందని తెలిపారు.
టీహబ్ ఫేజ్-2 కోసం ప్రభుత్వం రూ.150 కోట్లను ఖర్చు చేయనుందని తెలిపారు. టీ హబ్ రెండోదశ భవనం 3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసింది. మొదటి దశ ప్రారంభోత్సవానికి వేగిరంగా సిద్ధమవుతూనే టీహబ్ రెండో ఫేజ్‌ను సిద్ధం చేసేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతీసుకుంటున్నారు. రాయదుర్గంలోని ప్రతిపాదిత గేమ్‌సిటీ సవిూపంలోని 15 ఎకరాల్లో టీహబ్ ఫేజ్-2 క్యాంపస్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు పలు డిజైన్లను స్వయంగా పరిశీలించిన మంత్రి కేటీఆర్.. మరింత అత్యున్నత డిజైన్లను ఆహ్వానించారు.పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) విధానంలో రెండో దశను అందుబాటులోకి తేవాలని ప్రయత్నిసున్నారు. ఇదిలాఉండగా గ్రావిూణ ప్రాంతాల్లోని ఔత్సాహికులకు చేరువ అయ్యేందుకు వరంగల్ నిట్- రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం.