ఐపీఎల్-8లో ఫిక్సింగ్ కలకలం!
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-8 లో తాజాగా ఫిక్సింగ్ కలకలం రేగింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిని బుకీలు సంప్రదించి డబ్బులు ఇవ్వడానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాజస్థాన్ రాయల్స్- కింగ్స్ ఎలివన్ పంజాబ్ జట్ల మధ్య శుక్రవారం ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టుకు చెందిన ఆటగాడిని బుకీలు గత నెలలోనే సంప్రదించి ఫిక్సింగ్ కు చేయడానికి యత్నించినట్లు తెలిసింది.
అయితే ఆ డబ్బును తిరస్కరించిన సదరు ఆటగాడు ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక బృందం దృష్టికి తీసుకొచ్చాడు. మరో క్రికెటర్ కూడా ఫిక్సింగ్ గురించి మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై ఆ క్రికెటర్ ను యాంటీ కరప్షన్ మరియు సెక్యూరిటీ యూనిట్ (ఏసీఎస్ యూ ) సభ్యులు విచారిస్తున్నారు. ప్రస్తుతం జరిగే ట్వంటీ 20 లీగ్ లో లేని ఆటగాడికి డబ్బులు ఇవ్వజూపడనే వార్తల పట్ల సర్వత్రా కలకలం చోటు చేసుకుంది. ఓ అజ్ఞాత వ్యక్తి ఫిక్సింగ్ కు తెరలేపడానికి యత్నించాడన్న వార్తలతో ఐపీఎల్ ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.